- వెన్నుపోటుకు రంగం సిద్ధం
- ఇన్ చార్జి పదవి పోవడంతో మాజీ ఎమ్మెల్సీ అసహనం
- అనుచరుల వరుస సమావేశాలు
- అసెంబ్లీ అభ్యర్థిని ఇన్ చార్జీని మార్చాలంటూ డిమాండ్
భద్రాచలం నియోజకవర్గం ఇన్ చార్జి పదవి పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఒక బీఆర్ఎస్ నేత తన అనుచరులను ఎగదోస్తున్నాడు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకటరావును మార్చడమే కాక నియోజక వర్గం ఇన్ చార్జి పదవిని తమ నాయకుడికి కట్టబెట్టాలనే డిమాండ్ తో పదవీచ్యుత నేత అనుచరులు వరుస సమావేశాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు దశాబ్థాల క్రితమే ఖమ్మం వలసపోయిన సదరు నేత తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీల్లో అనేక కీలక పదవులు పొంది ఇప్పడు మాజీగా మారాడు. కానీ ఆయన భద్రాచలం నియోజకవర్గాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం విశేషం.
గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇన్ చార్జిగా వ్యవహరించి పార్టీ పంపిన నిధులను ఖర్చు పెట్టలేదనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఐదు మండలాల్లో ఆయన అనుచరులు కూడా తమ నేత అడుగుజాడల్లోనే నడిచారు. ఫలితంగా పార్టీ పరాజయం పాలయిందని ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ కు చేరాయి. అందుకే ఆయనకు కీలక పదవులేవీ దక్కలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాజీ నేతను భద్రాచలం నియోజకవర్గం ఇన్ చార్జి పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధును ఇన్ చార్జిగా నియమించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ టికెట్ ను ఆశించిన మాజీ ఎమ్మెల్సీ అనుచరుడు బోదెబోయిన బుచ్చయ్య కూడా తిరుగుబాటు వర్గంలో చేరారు.
అనుచరుల తిరుగుబాటు..
తమ నేతకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని ఆ నేత అనుచరులు తిరుగుబాటలో పడ్డారు. నియోజకవర్గం పరిథిలోని ఐదు మండలాల అనుచరులు ముందుగా చర్లలో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావుకు సహకరించకూడదని నిర్ణయించారు. తమ నేతకు ఇన్ చార్జి పదవిని కట్టబెట్టాలనే డిమాండ్ ను కూడా ముందుకు తెచ్చారు. భద్రాచలంలో కూడా మండల కమిటీ నేతలు కొందరు పార్టీ అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమావేశానికి కూడా వారు డుమ్మా కొట్టారు.
తిరుగుబాటు నేతలపై నివేదికలు..
బీఆర్ఎస్ తిరుగుబాటు నేతలపై కేసీఆర్ కు నివేదికలు అందుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటూ పార్టీ నియమించిన రహస్య విభాగం కూడా వీరి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నది. నియోజకవర్గ ఇన్ చార్జి తాతా మధుతో పాటు భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా నియోజకవర్గ అభ్యర్థితో మాట్లడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కీలక నేత అనుచరులు భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక, రియల్ ఎస్టేట్, దందాతో పాటు కాంట్రాక్టులు, పైరవీలకు పాల్పడుతూ గత ఐదారు సంవత్సరాలుగా ప్రజలకు దూరమై పోయారని కూడా కేసీఆర్ దృష్టికి వెళ్ళింది. పార్టీ నిర్మాణానికి వీరు కృషి చేయక పోగా వ్యక్తిగత ఆస్తులు కూడ బెట్టుకున్నారని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.
వెన్నుపోటు రాజకీయాలు..
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మాజీ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారని ఆయన గత చరిత్ర తెలిసిన నేతలు అంటున్నారు. కొమరం ఫణీశ్వరమ్మ పోటీ చేసినప్పుడు కూడా మాజీ అనుచరులు మోసం చేశారని చంద్రబాబు ముందు వాపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెనుకబడిన వెంకటాపురం ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పదవ తరగతి కూడా ఉత్తీర్ణుడు కాకపోయినా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో అనేక పదవులు వరించాయి. డీసీఎంఎస్ చైర్మన్ గా అయన అభ్యర్థిత్వాన్ని బల పరచిన నాటి జిల్లా పరిషత్ చైర్మెన్ చేకూరి కాశయ్య ను వదలి వేసి కోనేరు నాగేశ్వరరావు చెంతన చేరారు. డీసీసీబీ చైర్మెన్ గానూ, జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ ఎంపిక చేసిన కోనేరుకు వెన్నుపోటు పొడిచి తుమ్మల వర్గంలో చేరారు. రెండు సార్లు ఖమ్మం ఎమ్మెల్యే టికెట్ ను ఇప్పించడమే కాక పైసా ఖర్చు లేకుండా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన తుమ్మల నాగేశ్వరరావుకు కూడా శఠగోపం పెట్టి ఆయన పదవి పోగానే పువ్వాడ అజయ్ పంచన చేరారు. మాజీ ఎమ్మెల్సీ స్వగ్రామమైన వెంకటాపురం సర్పంచ్, ఎంపీపీ,సింగిల్ విండో చైర్మెన్ వంటి కీలక పదవులను కాంగ్రెస్ గెలిపించుకోగా గొప్ప నేతగా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి అనుచరులు పరాజయం పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాజీ ఎమ్మెల్సీ మండలమైన వెంకటాపురంతో పాటు వాజేడు, చర్ల మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వచ్చింది.