త్వరగా కూల్చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి
జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. మున్సిపల్ కౌన్సిల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కమిషనర్, అడిషనల్ కలెక్టర్‌ను పిలిచి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు ఇవాళ వ్యక్తిగతంగా నోటీసులు అందజేసి, తాను అమెరికా వెళ్లి వచ్చే లోగా అంటే ఈ నెల 11వ తేదీలోగా పార్టీ ఆఫీసును కూల్చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.
లేదంటే కమిషనర్‌పై కేసు పెట్టి ఎందుకు కూల్చడం లేదో విచారించి జైలుకు పంపించాలని అడిషనల్ కలెక్టర్‌ను ఆదేశించారు. కమిషనర్ ఈ విషయంలో స్పందించకపోతే దగ్గరుండి బీఆర్‌ఎస్ ఆఫీసు కూల్చే విధంగా బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి సూచించారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని మంత్రి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఆఫీసు రేకులను విప్పి పార్టీ అధ్యక్షుడి ఇంటి దగ్గర పెట్టేసి వెంటనే కూల్చేయాలని అధికారులను ఆదేశించారు.
అక్కడ సప కాలనీలకు మంచినీటి సరఫరా నిమిత్తం 20 లక్షల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. అదేవిధంగా స్త్రీ నిధి భవనం సైతం అక్కడ నిర్మించి పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను ఆదేశించారు.