- రాష్ట్ర పార్టీని ఆదేశించిన అమిత్ షా
- తెలంగాణ వ్యాప్త ప్రచారానికి శ్రీకారం
- స్టార్ క్యాంపెనర్ గా కొనసాగాలని పిలుపు
తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్త ప్రచార నిమిత్తం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కు అధిష్టానం హెలికాప్టర్ కేటాయించినట్లు విశ్వాసనీయ సమాచారం. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి స్టార్ క్యాంపెనర్ గా కొనసాగాలని సూచించినట్లు తెలిసింది. ఇందుకోసం బండి సంజయ్ తో అమిత్ షా ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సమన్వయంతో కృషి చేయాలని సూచించినట్లు వెల్లడైంది.
రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ను పార్టీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించినట్లు అర్థమవుతుంది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పలు ఎన్నికల్లో ఎన్నడు లేని విధంగా విజయాలు సాధించిన క్రెడిట్ సంజయ్ కి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ హెలికాప్టర్ వినియోగించనున్నారు. సంజయ్ తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు తెలిసింది.
అయితే కరీంనగర్ అసెంబ్లీ బరిలో బండి సంజయ్ నిలవడంతో ప్రతిరోజు రెండు సభల్లో పాల్గొని సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ చేరుకుని నియోజకవర్గంలో ప్రచారం చేపడుతారు. అయితే ఏ ఏ నియోజకవర్గం లో పాల్గొనాలి, ఎన్ని సభల్లో బండి సంజయ్ ప్రసంగం ఉండాలి అనేదానిపై రాష్ట్ర పార్టీ రోడ్డు మ్యాప్ తయారుచేస్తుంది.