- కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకిన బాలిక
- ప్రేమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని బలవన్మరణం!
- స్నేహితురాలి ఫిర్యాదుతో పోలీసుల దర్యాఫ్తు
హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం విషాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పైనుంచి చెరువులో దూకి పదిహేడేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనే కారణంతోనే ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన పాయల్ (17) కుటుంబంతో సహా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మాదాపూర్ లోని ఓ ఇంట్లో పాయల్ హౌస్ మేడ్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో పాయల్ ఓ యువకుడిని ప్రేమించిందని, వారి ప్రేమకు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీనిపై ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం పాయల్ తన స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జి చూసేందుకు వచ్చింది. సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపిన పాయల్ ఉన్నట్టుండి బ్రిడ్జి పైనుంచి చెరువులోకి దూకేసింది. పాయల్ స్నేహితురాలు అందించిన సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పాయల్ ను కాపాడేందుకు విఫలయత్నం చేశారు.
పాయల్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంట్లో వాళ్లు తన ప్రేమను ఒప్పుకోకపోవడంతోనే పాయల్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, సీసీ కెమెరాలు, 24 గంటల పాటు పోలీస్ పహారా ఉన్నప్పటికీ కేబుల్ బ్రిడ్జి పైన ఆత్మహత్యల ఘటనలు ఆగడంలేదు. దుర్గం చెరువుపై 2020 లో కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఇక్కడ 30 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.