నలుగురు ఎన్సీపి నేతలు పార్టీకి గుడ్‌బై
అనేకులు మళ్లీ పవార్ గూటికి చేరేందుకు యత్నం
మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ.. అజిత్ పవార్ సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్ యూనిట్ చీఫ్ అజిత్ గవాహనేతోపాటు యష్ సానే, రాహుల్ బోంస్లే, పంకజ్ బాలేఖర్లు బుధవారం రాజీనామా చేశారు. అయితే వీరంతా వచ్చే వారం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కుండువా కప్పుకోనున్నారనే తెలుస్తుంది. మరోవైపు అజిత్ పవర్ పార్టీలోని పలువురు నేతలు తమ శిబిరంతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ శరద్ పవార్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక భోసారి అసెంబ్లీ టికెట్ కోసం అజిత్ గవాహనే ప్రయత్నించారు. కానీ ఆయనకు టికెట్ కేటాయించేందు అజిత్ పవార్ నిరాకరించారు. దీంతో ఆయన రాజీనామా చేశారనే ఓ ప్రచారం అయితే నడుస్తుంది. అదీకాక సదరు అసెంబ్లీ స్థానం నుంచి గత రెండు పర్యాయాలు బీజేపీ అభ్యర్థి మహేశ్ లంగ్డే విజయం సాధిస్తు వస్తున్నారు. అయితే మహారాష్ట్రలో మహాయుతి కూటిమి అధికారంలో ఉంది.
ఈ కూటమిలో శివసేన (శిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు ఉన్నాయి. దీంతో మరోసారి మహేశ్ లంగ్డేకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించే అవకాశాలున్నాయి. అదీకాక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఈ కూటమి కొన్ని సీట్లను మాత్రమే గెలుచుకుంది. చివరకు బారామతి నుంచి ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థిగా సుప్రియా సులే బరిలో దిగారు. ఆమెకు ప్రత్యర్థిగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేశారు. కానీ విజయం మాత్రం సుప్రియా సులేను వరించింది. అలాంటి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహాయుతి కూటమికి ప్రజల ఏ మేరకు విశ్వసిస్తారనే సందేహాలు సైతం వ్యక్తమవు తున్నాయి. ఇంకోవైపు కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రి పదవి అజిత్ పవార్ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎంపీకి కేటాయిం చేందుకు మోదీ సుముఖత వ్యక్తం చేశారు.
కానీ ఆ పదవి తీసుకునేందుకు అజిత్ పవార్ ససేమేరా అన్నారు. అయితే సునేత్ర పవార్‌ను రాజ్యసభకు పంపి.. తద్వారా మోదీ కేబినెట్‌లో ఆమెకు కీలక మంత్రి కేటాయించే లక్ష్యంతో అజిత్ పవార్ పావులు కదుపుతున్నారని సమాచారం. ఇక సునేత్రకు రాజ్యసభ సీటు కేటాయింపుపై ఆ పార్టీలోని కీలక నేత, మంత్రి చగన్ భుజబల్ సైతం తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సైతం ఆ పార్టీకి రాజీనామా చేసి.. శరద్ పవార్ పార్టీలో చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే శరద్ పవార్‌తో చగన్ భుజబల్ మంగళవారం భేటీ కావడం గమనార్హం. దీంతో ఆయన సైతం అజిత్ పార్టీకి రాజీనామా చేయడం ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.