విజయవాడ, జూలై 28:విజయసాయిరెడ్డి రెండేళ్ల కిందటి వరకూ వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 స్థానంలో ఉండేవారు. తర్వాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకే పరిమితమవుతూ వస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ రాజకీయాల్లో కీలకమయ్యారని చెబుతున్నారు. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని జగన్ నియమించినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన చేయలేదు కానీ..ఆయన మత్రం పనిలోకి దిగిపోయారని అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డికి జగన్ బాధ్యతలిచ్చినట్లుగా చెబుతున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్ ఇటీవలడి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించకుండా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది. వైఎస్ జగన్ నమ్మే అతి కొద్ది మందిలో సాయిరెడ్డి మొదటి వ్యక్తని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి.
పైగా రాజకీయంగా ఆయనకు అపార అనుభవమే ఉందని.. వీటన్నింటికీ మించి ఎలాంటి నేతల మధ్య విబేధాలున్నా ఒకట్రెండు సమావేశాలతోనే కలిపేసే సత్తా కలిగి ఉన్న నేత అని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈయనైతేనే ఈ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలను సమన్వయం చేసుకోగలరని సీఎం విశ్వసిస్తున్నారట. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి చేతికి జగన్ ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాల పగ్గాలిచ్చేశారు.నిజానికి గత ఫిబ్రవరిలో అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయ కర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. ఇంచార్జ్ గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కింద కో ఇన్ఛార్జిగా చెవిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు సాయిరెడ్డిని పక్కకు తప్పించి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.
ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి సజ్జల కుమారుడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ పదవి నుంచి సాయరెడ్డిని పక్కన పెట్టడం వైఎస్ఆర్‌సీపీలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవు.ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు నాలుగు జిల్లాల పదవి ఇచ్చారు. ఇటీవల విజయసాయిరెడ్డిని సీఎం జగన్ పిలిపించుకుని గతంలో మాదిరిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలని సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డి అవసరం పార్టీకి ఎంతో అవసరం ఉందని జగన్ గుర్తించారని అంటున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయమై విజయసాయిరెడ్డి కసరత్తు ప్రారంభించారని అంటన్నారు.