అదిలాబాద్, జూలై 21:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. కడెం వాగు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉదృతికి తగ్గట్టుగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు పంపేందుకు ప్రయత్నించిన కడెం ప్రాజెక్ట్ అదికారులకు మళ్లీ షాక్ తగిలింది. ప్రాజెక్ట్ లెవల్ 695 అడుగులు దాటడంతో వరద నీటిని కిందికి వదిలే ప్రయత్నంలో ఏకంగా ఆరు గేట్లు మొరాయించాయి. దీంతో షాక్ కు గురైన సిబ్బంది హుటాహుటిన మ్యానువల్‌గా గేట్లను ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ముగ్గురు సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. అయినా సిబ్బంది గేట్లను ఎత్తేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. గత ఏడాది వరద మహోగ్ర రూపంతో కడెంను ముంచెత్తడటంతో ప్రమాదం నుండి అదృష్టవశాత్తు బయటపడింది.
ఆ సమయంలో పాడైన మూడు గేట్లను మరమ్మత్తులు చేసినా ఫలితం లేనట్టుగానే తెలుస్తోంది.వరుసగా కురుస్తున్న వర్షాలతో దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్ట్ కు పోటేత్తడంతో గేట్లను ఎత్తే సమయంలో ఆరు గేట్లు మొరాయించాయి. గత వరదలతో పూర్తిగా దెబ్బ తిన్న 2, 3, 18 వ నెంబర్ గేట్లు మరమ్మత్తులు చేసిన కౌంటర్ బెడ్లు పూర్తి కాకపోవడంతో ఈసారి ఈ గేట్లను ఎత్తలేమని చేతులెత్తేసిన అదికారులు. ఇదే సమయంలో 6, 8, 12 , 16 నెంబర్ గేట్లు మొరాయించడంతో డేంజర్ జోన్ లో పడింది. మొత్తం 18 గేట్లకు గాను 11 గేట్లను ఎత్తి 155169 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అదికారులు. వరద 3.50 లక్షల క్యూసెక్కులు దాటితే మిగిలిన గేట్లు లేవకపోతే ప్రమాదం తప్పదన్న ఆందోళన కడెం ప్రాజెక్ట్ అదికారుల్లో కనిపిస్తోంది.