గుంటూరు, ఆగస్టు 4:ఇది ఎన్నికల సంవత్సరంలా కనిపిస్తోంది, ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల సంకేతాలను పార్టీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలని నడుచుకోవాలన్నారు. రాజకీయ పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని, ఒకవేళ పార్టీ స్థాపించినా రన్ చేయడం తేలిక కాదన్నారు. బెదిరింపులకు భయపడకుండా తనకు మద్దతుగా నిలిచిన వారికి, పార్టీకి అండగా నిలిచిన వారికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం అని, విలువలు పాటించే వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదని, అలాంటి పరిస్థితులు కల్పించాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకు వైజాగ్ లో తన పర్యటనను గుర్తుచేశారు. చిత్తూరు, శ్రీకాళహస్తిలో గొడవలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. సీఎం జగన్ పాలన ఎలా ఉందంటే.. రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడం అనేలా ఉందన్నారు. రాజకీయం అంటే బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. జగన్ అనే అరాచకశక్తిపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.