- మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్
- మంత్రి రాజీనామాకు అన్నాడి ఎంకె డిమాండ్
చెన్నయ్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం (ఈడి) అరెస్ట్ చేసిన తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీకి చెన్నయ్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బుధవారం ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనను పరీక్షించి యాంజియోగ్రమ్ నిర్వహించారు. అనంతరం మెరుగైన చికత్సి నిమిత్తం చెన్నయ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ అవసరమని తేల్చారు. గతంలో అన్నాడిఎంకె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు సెంథిల్ బాలాజీ ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని ఈఢీ అనుమానించి అరెస్ట్ చేసింది. కాగా, సెంథిల్ బాలాజీ అవినీతి భాగోతంలో అరెస్ట్ కాగానే గుండెనొప్పి పేరుతో డ్రామా ఆడుతున్నారని, ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నాడి ఎంకె డిమాండ్ చేసింది. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి జయకుమార్ అరెస్ట్ అయి 20 రోజులు జైలులో ఉన్నపుడు వైద్య సహాయం అందలేదని, కనీసం మందులు కూడా వేసుకోనివ్వలేదని ఆ పార్టీ ఆరోపించింది.
ఇదిలా ఉండగా, బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ , డి ఎంకె తదితర పక్షాలు ధ్వజమెత్తాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించాయి. దీనికి బిజెపి కూడా ధీటుగా బదులిచ్చింది. ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తోందని , తమకు ఎవరిపైనా కక్ష తీర్చుకోవాల్సినంత అవసరం కాని, అగత్యం కాని లేదని స్పష్టం చేసింది. ఆధారాలుంటేనే ఈడీ చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారు.కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి బాలాజీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ పరామర్శించారు.