ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో స్తబ్దత నెలకొంది. ఎన్నికల టైం దగ్గర పడుతున్నా అభ్యర్థుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అసహనంగా ఉన్నాయి పార్టీ శ్రేణులు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. నిన్న, మొన్నటి దాకా తీగల కృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి సీనియర్స్ కారు పార్టీకి బైబై చెప్పి కాంగ్రెస్ లోకి వస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. కొందరైతే… బీఆర్ఎస్ నేతలతో రహస్య సమావేశాలు జరిపి సీట్ల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై పెద్ద ఎత్తునే చర్చలు నిర్వహించారు. అయితే అధికార పార్టీ…సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడంతో పాటు ఆశావాహులందరిని ప్రగతి భవన్‌కు పిలిచి వారికి కావాల్సిన హమీలు ఇచ్చి దారికి తెచ్చుకోవడంతో.. మొదట్లో కాస్త కనిపించినా… క్రమంగా అసంతృప్తులు చల్లబడ్డాయి.
దీంతో కాంగ్రెస్ నేతలు కంగుతింటున్నారట.ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది కారు దిగి చెయ్యి పట్టుకుంటారని అనుకున్నా… ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఆ వాతావరణమే కనిపించడం లేదంటున్నారు. బీఆర్‌ఎస్ వలసలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు అలాంటి వాతావరణం కనిపించకపోవడంతో ఇక బీజేపీలోని జిల్లాకు చెందిన బలమైన నేతలకు గాలం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు బీఆర్‌ఎస్ అసంతృప్తులపై బీజేపీ సైతం ఆశలు పెట్టుకున్నా… ఉపయోగం లేకుండా పోయిందట.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి రంగారెడ్డిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్దులు కరువయ్యారన్నది పార్టీ వర్గాల మాట. ఉదాహరణకు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి బరిలో ఉన్నారు.
మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అసంతృప్తితో బయటికి వస్తే .. మహేశ్వరం టిక్కెట్ ఇచ్చి సబిత మీద పోటీ పెడదామనుకున్నారట కాంగ్రెస్ నాయకులు. కానీ.. ఆ ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం అక్కడ బడంగ్‌పేట్ మేయర్ పారిజాత, డిసిసి అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, దేపా భాస్కర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి లాంటి చాలా మంది నేతలు టిక్కెట్ ఆశిస్తున్నా… వారిలో ఎవరికీ సబిత స్థాయి లేదని పార్టీలోనే చర్చ నడుస్తోంది. గెలుపు సంగతి పక్కనపెడితే…వీరిలో ఎవరికీ కనీస పోటీ ఇచ్చే సామర్ధ్యం లేదంటున్నారు.దీంతో ప్రస్తుతం మహేశ్వరం కాంగ్రెస్ దిక్కు మొక్కు లేకుండా ఉందట. ఇక ఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇద్దరు ముగ్గురు పోటీలో ఉంటే… ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తారు…మనం బరిలో ఉంటామన్న ధీమాతో పనిచేయవచ్చు. కానీ… అసలు అభ్యర్థి ఎవరో తెలీదు, పని చేయాలన్న ఉత్సాహం ఎలా వస్తుందని అడుగుతున్నారట కార్యకర్తలు.