పార్టీ చేసిన రైతు డిక్లరేషన్..బోగస్
బీఆర్‌ఎస్ హాయాంలో రైతులకు తీవ్ర అన్యాయం
కేసీఆర్ మాటలు కోటలు దాటితే.. పనులు ఫామ్ హౌస్ దాటలేదు..
ఇచ్చిన హమీని అమలు చేయడమే మోదీ గ్యారంటీ
రైతు దీక్షలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. హామీలు నెరవేర్చకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రైతులను అనేక రకాలుగా అన్యాయం చేసిందని అన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటేవని, కానీ పనులు మాత్రం ఫామ్ హౌస్ కూడా దాటలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ చేస్తామని, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బంది పెట్టారన్నారు. అందుకే, రైతులను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో 400 పైగా హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. రైతుల కష్టాలు తీరుస్తామని, అనేక రకాలుగా ఆశలు రేకెత్తించారని, గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. వంద రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి వంటివారు అనేక ప్రాంతాల్లో చెప్పారు కానీ ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ గ్యారంటీ అంటే… ప్రజలను మభ్యపెట్టే, మోసం చేసే గ్యారంటీ అని, రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. సోనియమ్మ పాలన రాగానే డిసెంబరు 9న తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎవరూ కూడా బ్యాంకులకు అప్పులు కట్టొద్దని, కొత్తగా రుణాలు తీసుకోండని రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఆయన మాటలను నమ్మి కాంగ్రెస్‌కు వోటేస్తే రైతులను మోసం చేశారని మండిపడ్డారు. నేడు రైతులకు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, రైతులు దలారీల వద్ద వడ్డీలకు అప్పులు తెచ్చుకొని పంటలు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదని, వారు వసూళ్లకు పాల్పడి ఆ పైసలను దిల్లీకి పంపడంపైనే శ్రద్ధ ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందో రేవంత్ రెడ్డి స్ఫష్టం చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో తెలంగాణ రైతులను మోసం చేయడమే వారి ఉద్దేశమని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. గత సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో దళితులను, గిరిజన బంధు పేరుతో గిరిజనులను మాయమాటలతో వెన్నుపోటు పొడిచారని, ఏ వర్గానికి ఎలాంటి బంధు ఇవ్వలేదని విమర్శించారు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ఉందన్నారు. రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన పోయి.. మరొక కుటుంబ పాలన వొచ్చిందని, ఒక వసూలు రాజ్యం పోయి.. మరొక వసూలు రాజ్యం వొచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 15 వేల చొప్పున రైతుబంధు ఇస్తామని ప్రకటించిందని, కానీ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, మార్పు అంటే మతిమరుపు మార్పా..అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షల లోపు రైతు రుణాల మాఫీ, రూ. 15 వేలు రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు, వరికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ వంటి హామీలు అమలు చేయలేదని తెలిపారు.
రైతులకు అండగా మోదీ ప్రభుత్వం
స్వాతంత్య్రం వొచ్చినప్పటి నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు గరిష్టంగా రూ. 1400 మద్దతు ధర మాత్రమే ఉండేదని, నరేంద్ర మోదీ పాలనలో రూ. 2200 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 26 వేల కోట్ల ఖర్చుతో ధాన్యం కొనుగోలు చేస్తుందని, ప్రతి బస్తాకు ఇచ్చే సుతిలి, కూలీ, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు, రైస్ మిల్లులకు చార్జీలు.. రైతు కల్లాల నుంచి మొదలు ధాన్యం ఎఫ్ సీఐ గోదాంలకు చేరే వరకు అన్ని రకాల ఖర్చులను కేంద్ర భరిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలులో అండగా ఉంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 2,200 బోనస్ ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వమిచ్చే బోనస్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్‌తో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలకు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంతో రైతులు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్ అని, రైతులకు ఇచ్చిన గ్యారంటీ బోగస్ గ్యారంటీగా కిషన్ రెడ్డి అభివర్ణించారు.
వొచ్చే ఎన్నికల్లో వోటు అడిగేందుకు వొచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులు హామీలు, గ్యారంటీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో దేశంలో కరెంటు కోతలు, ఎరువుల కరువు ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం వొచ్చిన తర్వాత కరెంటు కోతలు లేని నవ భారతాన్ని నిర్మించారని కొనియాడారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పారిశ్రామిక రంగంతో పాటు అనేక రకాలుగా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, చెప్పులు బారులు తీరిన క్యూలైన్లు కనపడేవని, అనేకసార్లు లాఠీచార్జ్‌లు జరిగాయని, రైతులు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి.. నీమ్ కోటింగ్‌తో యూరియాను అందిస్తుందని వివరించారు. రైతులకు యూరియా కొరతలేని భారతదేశాన్ని నరేంద్ర మోదీ నిర్మించారని, ప్రపంచ వ్యాప్తంగా యూరియా ధరలు పెరిగినా దిగుమతి చేసుకున్న యూరియాతో రైతులపై ఎలాంటి భారం పడకుండా ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.
కూరగాయల పంటలు, ఫామాయిల్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా అగ్రికల్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయకుండా రైతులను నిండా ముంచిందని, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా బీఆర్‌ఎస్ సర్కారు అడ్డుకుందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తుందని తెలిపారు. మోదీ గ్యారంటీ అంటే..ఇచ్చిన హమీని అమలు చేసే గ్యారంటీ అని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఉగ్రవాదం నిర్మూలన, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వంటి అనేక గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అండగా బిజెపి నిరసన దీక్షను చేపట్టిందని తెలిపారు. రైతులకు అండగా బిజెపి ఉంటుందని ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల
పారాబాయిల్డ్ బియ్యం సేకరణకు ఆమోదం
ఆదేశాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
2023-24 ఖరీఫ్ మరియు రబీ సీజన్ లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గానూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనీస మద్దతు ధరను, రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఇచ్చిన రూ. 500 బోనస్ ను చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి వరిధాన్యాన్ని వెంటనే సేకరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు లబ్ధి చేకూరేందుకు వీలున్న అన్ని మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషిచేస్తోందని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.