A place where you need to follow for what happening in world cup

ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ మోదీకి తాకట్టు…

కాంగ్రెస్‌ పార్టీ జాగీర్దార్లకో, జమీందార్లకో టికెట్లు ఇవ్వలేదు..
ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది
 అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి
నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులిస్తాం..
 నారాయణపేట జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ఐదు పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారని, బిడ్డ బెయిల్‌ కోసం కేసీఆర్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని, ఆయన పూర్తిగా  మోదీకి లొంగిపోయారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణ పేట లో  సోమవారం  జరిగిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేశామని తెలిపారు. పదేళ్లు కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైన్‌ ను పెండిరగ్‌ లో పెట్టారని, కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైన్‌ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ జాగీర్దార్లకో, జమీందార్లకో టికెట్లు ఇవ్వలేదని, సామాన్యులకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత కాంగ్రెస్‌ కు దక్కుతుందని తెలిపారు.  10 శాతం జనాభా ఉన్న ముదిరాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు.

తమకు అవకాశం ఇవ్వని కేసీఆర్‌ ను ఎన్నికల్లో ముదిరాజ్‌ లు మట్టికరిపించారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ లో నీలం మధు ముదిరాజ్‌ ను, మహబూబ్‌ నగర్‌ లో వంశీ చంద్‌ ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో కనీసం 14 స్థానాల్లో కాంగ్రెస్‌ ను గెలిపించాలని కోరారు. ఆగస్టు 15లోగా ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇదే వేదికగా ముదిరాజ్‌లకు మాట ఇస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ చిత్తశుద్దితో ఉందని, ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని కోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టామని తెలిపారు. ఆనాడు పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే వర్గీకరణకు అండగా తాను నిలబడ్డానని తెలిపారు. సిరిసిల్ల రాజయ్యకు ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ను చేశామని, అడ్లూరి లక్ష్మణ్‌ ను విప్‌ ను చేశామని, దామోదర రాజనర్సింహకు మంత్రిగా అవకాశం కల్పించామని ఉదహరించారు. సీఎం పేషీలో ఒక మాదిగ బిడ్డకు అవకాశం కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో మాదిగ బిడ్డలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గద్వాలలో సరితమ్మ గెలిచి ఉంటే ఇవాళ మంత్రి అయ్యేదన్నారు. అరుణమ్మ కుట్ర చేసి కురుమ యాదవ బిడ్డ సరితమ్మను ఓడిరచిందని తెలిపారు. నారాయణపేట మున్సిపాలిటీకి అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణానికి నిధులు ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వకపోతే అరుణమ్మ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైన్‌ పూర్తి చేసేందుకు ఎందుకు చొరవ చూపలేదు?
కాంగ్రెస్‌ ను ఓడిరచాలని అరుణమ్మ చెబుతోంది.

 

రాష్ట్రంలో పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు కాంగ్రెస్‌ ను ఓడిరచాలా? రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నందుకు కాంగ్రెస్‌ ను ఓడిరచాలా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నందుకా? ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నందుకా? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం తీసు కొచ్చామని.. ఇన్ని చేసిన కాంగ్రెస్‌ ను ఎందుకు ఎందుకు ఓడిరచాలని ప్రశ్నించారు. తాను మీ బిడ్డను.. పాలమూరు మట్టి బిడ్డను… పాలమూరు సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఏం.. దొరల బిడ్డలే సీఎం కావాలా? పాలమూరు బిడ్డలకు ఆ అర్హత లేదా? మాకేం తక్కువ?
అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

అరుణమ్మ బీజేపీ ముసుగులో బీఆరెస్‌ తో కుమ్మక్కై రేవంత్‌ రెడ్డిని పడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. గద్వాల బంగ్లాలో కుమ్మక్కు రాజకీయలు చేస్తున్నారని, బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బయటకు వచ్చి ఓట్లు అడగడంలేదని విమర్శిచారు.  వంద రోజుల్లో నన్ను గద్దె దిగమంటున్న కేసీఆర్‌.. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీని గద్దె దిగమని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.  ఆగస్టు 15లోగా ఏక కాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే పంట సీజన్‌ నుంచి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చే బాధ్యత నాదని, మీరు పెంచిన ఈ మొక్క చెట్టుగా మారి నీడనిస్తోంది. ఈ చెట్టును నరికెందుకు బీజేపీ, బీఆరెస్‌ భుజాన గొడ్డలి పట్టుకుని బయలుదేరాయి. ఈ చెట్టును కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో వంశీచంద్‌ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించండి..అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.