A place where you need to follow for what happening in world cup

భద్రాద్రి రాముడిపై శీతకన్ను..

Bhadradri temple developments

0 13,785
  • ఆలయ అభివృద్ధిపై నీలి నీడలు
  • అమలు కాని మాస్టర్ ప్లాన్
  • కల్యాణానికి రాని కేసీఆర్
  • భక్తుల మనోభావాలు పట్టించుకోరా?
  • అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంటే కీలకం
  • బీఆర్ఎస్ కు పట్టణ ఓటర్లు దూరం!

భద్రాద్రి రాముడిపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న రామాలయం అభివృద్ధి కేవలం హామీలకే పరిమితం కావడం విశేషం. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు. దేశ విదేశాల్లో ఎంతో ప్రాముఖ్యం కలిగిన భద్రాచలం రాముడ్ని దర్శించుకోవడానికి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు జరిగే కల్యాణాన్ని నేరుగా చూడలేని వారు కూడా టీవీల్లో వచ్చే ప్రత్యక్ష ప్రసారాల ద్వరా వీక్షిస్తుంటారు. స్వామి వారి తలంబ్రాలను వివాహ సమయంలో అక్షింతల్లో కలపడానికి ప్రవాస భారతీయులు కూడా ఆసక్తి చూపుతుంటారు. గోదావరి తీరంలో కంచర్ల గోపన్న నిర్మించిన ఈ ఆలయాన్ని, భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తూర్పు ద్వారం ఏర్పాటు చేయడమే కాక ఆలయాన్ని కొంత మేరకు ఆధునీకరించారు. అప్పటి నుంచీ భక్తుల సంఖ్య మరింత పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన సందర్భంగా భద్రాద్రి రామాలయం అభివృద్ధి అంశం కూడా తెరపైకి వచ్చింది. 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ ఇది కార్యరూపం దాల్చలేదు.

అమలు కాని మాస్టర్ ప్లాన్..

రామాలయం అభివృద్ధిపై కేసీఆర్ ప్రకటన తర్వాత ఆయన ఆదేశం మేరకు అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిన్నజీయర్ స్వామి, మై హోం చైర్మెన్ జూపల్లి రామేశ్వరరావు, యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనందసాయి హెలికాప్టర్ పై భద్రాచలం వచ్చి ఆలయాన్ని, పరిసర ప్రాంతాల్ని సందర్శించారు. రూ. 400 కోట్లతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. పాత ఆలయం మార్చకుండా ఆలయాన్ని ఆధునీకరించడం, చుట్టూ ప్రాకారాలను, రాజ వీధులను విస్తరించడం, వెయ్యి కాళ్ళ మండపం నిర్మాణం, రహదారుల నిర్మాణం, విద్యుదీకరణ వంటి అనేక అంశాలను మాస్టర్ ప్లాన్ లో పొందుపరచారు. 2017 లో మాస్టర్ ప్లాన్ రూపొందించగా ఐదేండ్లు గడచినా ఇది అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామ నవమి, పట్టాభిషేకం కార్యక్రమాలకు కనీసం కోటి రూపాయలు కావాలని అధికార యంత్రాంగం కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు.

Bhadradri temple developments

కేంద్ర ప్రభుత్వ పనులు ప్రారంభం…

భద్రాచలం ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం రూ. 100 కోట్లు మంజూరు చేయగా వీటిలో తొలి విడతగా రూ. 40 కోట్లు విడుదల చేసింది. ఈ పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా వివిధ పనులను చేపట్టారు. కేంద్ర నిధులతో సెంట్రల్ లైటింగ్, ఆర్చ్, హోటల్, డార్మిటరీల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

సీఎం రాక పోవడంపైనా చర్చ..

రాముడి కల్యాణానికి తానీషా కాలం నుంచి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులందరూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. మర్రి చెన్నారెడ్డి,ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. వై.యస్. రాజశేఖరెడ్డి క్రమం తప్పకుండా కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత కేవలం 2015లో మాత్రమే కల్యాణానికి వచ్చారు. ఆ తర్వాత గత ఎనిమిదేండ్ల కాలంలో కల్యాణానికి రాలేదు. దేవాదాయ శాఖ మంత్రి మాత్రమే హాజరవుతున్నారు. గత సంవత్సరం వరద ప్రాంతాల పర్యటన భాగంలో భద్రాచలం వచ్చిన సీఎం రామాలయానికి వెళ్ళ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామాలయానికి పాలక వర్గాన్ని నియమించక పోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం..

రామాలయం అభివృద్ధికి నిధులు కేటాయించక పోవడమే కాక కల్యాణానికి సీఎం రాక పోవడం పట్ల భద్రాచలం పట్టణవాసులు, రాముడ్ని ఇలవేల్పుగా భావించే మధ్యతరగతి కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాంటీ సెంటిమెంట్ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడనుంది. ప్రతిపక్షాలకు ఇది ప్రచార అస్త్రం కానున్నది. భద్రాద్రి రాముడ్ని ముందుగా చూసి నీడ కల్పించి జీవితాంతం సేవ చేసుకుని తరించిన పోకల దమ్మక్క వారసులైన ఆదివాసీలు కూడా బీఆర్ఎస్ వైఖరిని విమర్శిస్తున్నారు.

కొండూరి రమేష్ బాబు
ఎడిటర్, రేలా న్యూస్

Leave A Reply

Your email address will not be published.