అవినీతి కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోర్టు రిమాండు విధించింది. చంద్రబాబు అభిమానులకు, టిడిపి కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులకు ఇది అశనిపాతమైతే, ఆయన వ్యతిరేకులకు, ప్రజాస్వామిక వాదులకు ఉపశమనం కలిగించేదే. ఎందుకంటే వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలిన చందంగా నాలుగున్నర దశాబ్దాలుగా అనేక ఆరోపణలు వచ్చినా అణువంతయినా అదరని,బెదరని బాబు చిన్నకేసులో అరెస్ట్ అయ్యారు. చివరి నిమిషం వరకు తప్పించు కోవడానికి బాబు శతవిధాలా పోరాడారు. ఆయనపై విచారణే జరగకుండా చూడాలని ఆయన ఆశ్రితులెందరో ఆరాటపడ్డారు. కోర్టు తీర్పుతో అన్నీ వమ్మయ్యాయి. దీంతో జస్టిస్ డిలేయిడ్ బట్ నాట్ డినెయ్డ్(Justice delayed but not denied) అనే మాట మరోసారి నిజమైంది. అలాగే, చంద్రబాబును అరెస్ట్ చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం నెరవేరినట్టయింది. నాడు వైఎస్ ఆర్, ఆ తర్వాత విజయమ్మ, అనంతరం లక్ష్మీపార్వతి తదితరులు ఎన్నో ఆరోపణలు చేస్తూ సాక్ష్యాధారాలు సమర్పించినా అవన్నీ అప్పట్లో కోర్టుల్లో వీగిపోయాయి.
విచారణార్హతే లేదనే కమ్మని సాంకేతిక కారణాలతో వాటన్నిటినీ బాబు దూదిపింజల్లా చెదరగొడుతూ దేశంలో తాను మచ్చలేని నాయకుడినని, సచ్చీలుడినని చెబుతూ వచ్చారు. కాగా, శనివారం ఆయనను అరెస్ట్ చేయడం మహాపరాధం అయినట్టు, ప్రళయం ఏదో ముంచుకు వచ్చినట్టు ఎపిలో నానా గందరగోళం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా నిరసన ధ్వనులు వినిపించాయి. బాబు అరెస్టుపై అంత ఆందోళన చెందవలసిన అవసరమేమిటో అర్థం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అనే మాట ఆయనకు (బాబుకు) వర్తించదా, ఏదో మిన్ను విరిగి మీద పడినట్టు బాధపడడం ఎందుకు? ఆయన చట్టానికి అతీతుడా, బాబు మానవాతీతుడైనట్టు, దైవాంశసంభూతుడైనట్టు చాలామంది భావిస్తున్నారు. నిజానికి మనదేశంలో చట్టం సంపన్నుల చుట్టమై, న్యాయం ఖరీదైన వస్తువై చాలా ఏళ్లయింది. మనిషిని మనిషిగా చూడడం ఈదేశంలో ఏనాడో మరిచిపోయారు. అయితే అతీత శక్తులున్నట్టు, లేకపోతే పురుగుకంటే హీనంగా చూడడం అలవాటై చాలారోజులైంది. ఆ విపరీత ధోరణి వల్లనే చంద్రబాబు అరెస్ట్ కు ఈ రకమైన స్పందన.
తనదాకా వస్తే కాని తత్వం బోధపడదన్నట్టు ఇప్పుడ సహజ న్యాయసూత్రాలు, ప్రజాస్వామ్యం, నిబంధనలు, నీతులు, సూక్తులు, సెక్షన్లు అన్నీ ఆయనకు, ఆయన అనుచరులకు గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణ గడ్డమీద తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికే భవనం దొరకకుండా అడ్డుపడ్డప్పుడు గాని, ఇస్తానని చెప్పినవాళ్లను రాత్రికి రాత్రే బెదిరించినప్పడు గాని, జలదుశ్యం నుంచి టిఆర్ ఎస్ కార్యాలయాన్ని బలవంతంగా ఖాళీచేయించి, సామాన్లు బయట విసిరినప్పుడు గాని ఈ ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలేదో తెలియదు. హైదరాబాద్ మేయర్ పదవికి అప్పట్లో టి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదన్ రెడ్డి అంగీకరిస్తే ఆయనను భయపెట్టి ఉపసంహరించుకునేలా చేసినపుడు, కెసిఆర్ ఎన్నికల ప్రచారం కోసం అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్న హెలికాప్టర్ ను రాకుండా చేసినపుడు ఇప్పుడు వల్లించే ఈ సహజన్యాయం ఎక్కడికి పోయిందో.? అలాగే, ఎన్ టిఆర్ నుంచి పార్టీని, పదవిని, సైకిల్ గుర్తును, బ్యాంకు ఖాతాలను లాక్కున్నపుడు గాని, కుటుంబ సభ్యులనే ఎన్ టిఆర్ మీదనే ఉసిగొల్పినపుడుగాని, జయకృష్ణను ఒకసారి ఎంపిగా , హరికృష్ణను ఎమ్మేల్యే కాకముందు మంత్రిగా తీసుకుని అనంతరం తొలగించినపుడు ఈ నైతికత ఏమైందో తెలియదు.
చట్టాలు చేసిన వ్యక్తిగా, చట్టాన్ని పాటించే వ్యక్తిగా తనపై ఆరోపణలు వచ్చినపుడు నివుత్తి చేయాలి. చట్టానికి సహకరించాలి. కాని గగ్గోలు పెట్టకూడదు.విచారణను ఎదుర్కొని నిరపరాధిగా, నిర్దోషిగా బయటపడాలి. కాని కేసే పెట్టవద్దనడం, అరెస్టే చేయవద్దనడం ఏమిటి?. ఆయన వ్యవహార శైలి ఆదినుంచీ వివాదాస్పదమే. ఆయన అవకాశవాద రాజకీయాల స్రష్ట. వాడుకొని వదిలేయడంలో దిట్ట. నిజానికి బాబు ఏనాడో అరెస్ట్ కావాలి. ఎందుకంటే ఆయన హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. కాని వేటిలోనూ ఆయనను విచారణను ఎదుర్కోలేదు. వయసు, రాజకీయానుభవం కారణాలతో అరెస్ట్ ను తప్పు పట్టడం సరికాదు. ఆయనకంటే వయసులో పెద్దవారు, ఆయనకంటే ఉన్నత పదవుల్లో ఉన్నవారు అరెస్టయిన చరిత్ర ఈ దేశంలో ఉంది. ఎమర్జెన్సీలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కె. అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్,మధు దండావతే తదితర మహామహులు, అనంతరం జనతాపార్టీ హయాంలో ఇందిరాగాంధీ అరెస్టయ్యారు. తమిళనాడులో కరుణానిధి, జయలలితలు పరస్పరం అరెస్టులకు పాల్పడ్డారు. బాబు రాజకీయ జీవితం చూసినా, కుటుంబ జీవితం చూసినా, పార్టీ వ్యవహారాలను, పాలనా విధానం చూసినా అంతా గొప్ప మేనేజ్ మెంటే కనిపిస్తుంది. ప్రపంచాన్ని చుట్టిరావడం కోసం కుమారస్వామి అవస్థలు పడితే, నిలబడిన చోటనే శివప్రదక్షణ చేసి ఫలితం సాధించిన వినాయకుడిలాంటివాడు చంద్రబాబు. ఏ కేసు ఎవరు వేసినా వెళ్లేది కోర్టుకే కదా అక్కడ చూసుకుంటే పోలా..అనేది బాబు పాలసీ. ఇన్నాళ్లు ఈ విధంగానే తప్పించుకుంటూ వచ్చారు. ఇప్పడు చిక్కారు.
ఇక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రపంచబ్యాంకు సంస్కరణలను అమలు చేసి ప్రైవేటైజేషన్ కు దారులు వేశారు. అనేక ప్రభుత్వ రంగసంస్థలను దివాళా తీయించారు. ఆర్ టిసిని ప్రైవేట్ పరం చేయాలని యోచించారు. విద్యుత్ బోర్డును మూడు ముక్కలు (ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలు)గా చేశారు. 2004లో మళ్లీ అధికారంలోకి వస్తే డిస్కంలను ప్రైవేట్ పరం చేయాలని స్కెచ్ వేశారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ లో ఉండి టిఆర్ ఎస్ సర్కార్ ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నారు. ఎమ్మేల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిపోయి మేనేజ్ మెంట్ కళతో తప్పించుకు తిరుగుతున్నారు. 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రానికి 22 ఎకరాలలో సెక్రటేరియట్ సరిపోగా, 13 జిల్లాల విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కోసం వేల ఎకరాలను సేకరించి అక్కడి రైతుల నోట మట్టిగొట్టారు. ఏలేరు స్కాం, ఫార్ములా వన్ రేస్ వంటి కుంభకోణాలెన్ని జరిగినా తన పేరు బయటకు రాకుండా చూసుకుంటూ దశాబ్దాలుగా పబ్బం గడుపుకుంటున్నారు.
ఆయనంత పచ్చి అవకాశవాది ఈ దేశంలో వేరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా దేవెగౌడను ప్రధానిగా చేయడంలోను, దింపి ఐకె గుజ్రాల్ ను ఎక్కించడంలోనూ చక్రం తిప్పారు. అలాగే వాజపేయి సర్కార్ కు వ్యతిరేకంగా ఓటువేసి, రెండవసారి ఆయనకు మద్దతు తెలిపారు. గుజరాత్ సి ఎం గా నరేంద్రమోడీని తీవ్రంగా వ్యతిరేకించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసి, ప్రధాని కాగానే మోడీ పంచన చేరడం , మళ్లీ వ్యతిరేకించడం ఆయనకే చెల్లింది. పివి హయాంలో ఒక నిందితుడి డైరీలో ఎల్.కె అనే పొడి అక్షరాలున్నందుకు అప్పటి బిజెపి నేత న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి నిర్దోషిగా బయటపడేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒక్క చంద్రబాబు మాత్రమే మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా స్టేల మీద ఆధారపడి రాజకీయాలు నెరపుతూ వచ్చారు. ఇప్పుడు తొలిసారి దీనికి బ్రేక్ పడింది.

9908212563