A place where you need to follow for what happening in world cup

కొల్లాపూర్ లో బీఆర్ఎస్ కు గడ్డుకాలం

కాంగ్రెస్ కంచుకోటలో కారు దూసుకెళ్లే నా:కొల్లాపూర్ నియోజక వర్గంలో విజయం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని అనుకూలతలు ఉన్న ప్రతికూలతలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరాక మాజీ మంత్రి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య పోటాపోటీ పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేయడం హర్షవర్ధన్ రెడ్డికి అనుకూల అంశంగా చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కృష్ణారావు వెంట నడిచిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలను గ్రామ గ్రామ తిరిగి పార్టీలో చేర్చుకోవడం సానుకూల పరిణామమే. తాజాగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి రంగీనేని అభిలాషరావు బీఆర్ఎస్ లో చేరటంతో మరింత ఊతంగా భావించవచ్చు. ఇటీవల పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక మోటార్ను నార్లాపూర్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ సభ కొత్త ఊపు తెచ్చాయి.

కార్యకర్తలు కేరింతలతో హర్షవర్ధన్ రెడ్డి పై ముఖ్యమంత్రి కి సానుకూల సంకేతాలు ఇచ్చారు. గ్రామ గ్రామాల్లో ప్రజలతో మమేకమై పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల అందజేత ఎమ్మెల్యేను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సోమశిల బ్రిడ్జ్, కొల్లాపూర్- కల్వకుర్తి 165 నెంబర్ జాతీయ రహదారి, మామిడి పరిశోధనా కేంద్రం తదితర అభివృద్ధి పనులు కలిసి వచ్చే అంశాలుగా భావించవచ్చు. కాంగ్రెస్లో కృష్ణారావు, జగదీశ్వర రావు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. కృష్ణారావు పై జగదీశ్వరరావు వర్గం గుర్రుగా ఉంది. కృష్ణారావుకు టికెట్ వస్తే జగదీశ్వర్ రావు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి , లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయటమో జరగవచ్చని, ఇది బి ఆర్ ఎస్ కు సానుకూల అంశంగా మారవచ్చునే చర్చ జరుగుతోంది.

కొల్లాపూర్ ప్రజలకు ప్రతి టర్మకు ఒకసారి ఎమ్మెల్యేను మార్చే చరిత్ర లేదు. మూడు దశాబ్దాల పరిస్థితిని గమనిస్తే ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి ఎమ్మెల్యేను మార్చే ఆనవాయితీ కొల్లాపూర్ ప్రజలకు తక్కువ. మూడుసార్లు వెంకటేశ్వరరావు, ఒకసారి రామచంద్రరావు, మరోసారి మధుసూదన్ రావు, ఆ తర్వాత ఐదుసార్లు కృష్ణారావు గెలిచారు. ఇది ఆశావహ అంశం గా చెప్పవచ్చు.అలాగే బీఆర్ఎస్ కు ప్రతికూల అంశాలు కూడా చాలా ఉన్నాయి. అక్టోబర్ 16న కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పక్కనే హరిత ట్రిబ్యునల్ లో కేసు వేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని పెట్టుకొని ఉమ్మడి జిల్లా అడ్డుపడ్డారని విమర్శించటం సభకు వచ్చిన ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. నియోజకవర్గం ప్రజల్లో కూడా చర్చనీయాంశమైందని, ఇది ప్రతికూల అంశంగొ విశ్లేషకులు భావిస్తున్నారు.

కొల్లాపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ కు బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవటం. ఎమ్మెల్యే ప్రజల్లో మమేకమైనా గ్రామస్థాయి కేడర్లలో దాన్ని అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళే మండల నాయకత్వం కనిపించడం లేదంటున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు బీసీ బందు, దళిత బంధు, గృహలక్ష్మి , కాంట్రాక్ట్ పనులు తదితర వాటి విషయంలో గ్రామాల బీఆర్ఎస్ క్యాడర్లో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇది నష్టం చేసే అంశంగా చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారనే అపప్రద కూడా ఉందంటున్నారు. గత ఎన్నికల్లో ఐక్యంగా కసిగా పనిచేసిన రెడ్డి సామాజిక వర్గంలో ఈసారి కొంత అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. రెడ్డి వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ కృష్ణారావు, మరికొందరు జగదీశ్వర గ్రూపులో చేరటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. గతఎన్నికల్లో గ్రామాల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదని, పెండింగ్లో ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. కేతేపల్లి, సింగోటం, కల్వకోలు మూడు మండలాల ఏర్పాటు హామీలు అమలు కాలేదు. ఆ ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం కాదన లేనిది.

అయితే అభివృద్ధి పేరుతో కాంగ్రెస్లో గెలిచి బిఆర్ఎస్ లో చేరికపై విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీలోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ లో చేరినట్లు చెబుతున్నా, ఆశించిన స్థాయిలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, స్వప్రయోజనాల కోసమే చేరారనే ఆరోపణలు ప్రతికూల అంశాలుగా చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా విజయవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ఐక్యత, అభ్యర్థి పరిస్థితిని బట్టి హర్షవర్ధన్ రెడ్డి గెలుపు ఓటములపై అంచనాకు రావచ్చని ఇప్పుడే చెప్పటం కష్టం అంటున్నారు. ద్వితీయ స్థాయి నాయకత్వాన్ని పెంచటం, గ్రామ క్యాడర్లలో ఐక్యత సాధించటం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చటం, ప్రజలకు మరింత చేరువ కావటానికి ఎమ్మెల్యే చెమటోడ్చవలసిన అవసరం ఉందంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.