హైదరాబాద్:బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే నని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. అంతా ఎన్నికల కమీషన్ ను తప్పు దోవ పట్టించిన వాళ్లే. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే. ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమని ఆమె అన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామని అన్నారు.