తెలంగాణ బీజేపీ టికెట్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. 119 స్థానాలకు గాను 6003 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టికెట్లకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజే 2781 దరఖాస్తులు వచ్చాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు మొత్తంగా 6,003 అప్లికేషన్లు వచ్చాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. ఒక్కొక్కరూ 3, 4 స్థానాలకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, శేరిలింగంపల్లి నుంచి గజ్జల యోగానంద్, రాజేంద్ర నగర్ నుంచి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, సనత్ నగర్ నుంచి ఆకుల విజయ, జనగామ నుంచి బేజాది బీరప్ప, పాలకుర్తి నుంచి యొడ్ల సతీష్ కుమార్, ముషీరాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి, గాంధీ నగర్ కార్పొరేటర్ పావని దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 4న 182 దరఖాస్తులు రాగా, 5న 178, 6న 306, 7న 333, 8న 621 , 9న 1603, 10వ తేదీన 2781 దరఖాస్తులు వచ్చాయి.