A place where you need to follow for what happening in world cup

విద్యార్ధులకు ఫేసియల్ రికగ్నైజేషన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పనితీరును పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల చివరి నాటికి ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పాఠశాల విద్యా విభాగం ప్రారంభించనుంది. ఇది పాఠశాలలోని విద్యార్థుల చేరిక నుంచి మొదలుకుని.. వారి హాజరు శాతం, పాఠశాల ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల అభ్యాస స్థాయి, వారు సాధించిన విజయలు ఇలా అన్ని అంశాలను ఈ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, వైద్యారోగ్య శాఖ కమాండ్ కంట్రోల్ తరహాలో ఇప్పుడు పాఠశాల విద్యాశాఖలోనూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి విద్యా సమీక్ష కేంద్ర అని నామకరణం చేశారు. దాదాపు 5 కోట్ల రూపాయలతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఇందులో అత్యాధునిక కంప్యూటర్స్‌తో సహా.. 20 అడుగుల భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇక్కడి నుంచి ఈ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను పర్యవేక్షించడంతో పాటు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందుకోసం.. విద్యార్థులకు సంబంధించిన సమచారం, వారి అభ్యాస ఫలితాలను, మధ్యాహ్న భోజనంతో సహా వివిధ అంశాలను ఈ కమాండ్ కేంద్రంలో ఇంటిగ్రేట్ చేయనున్నారు. అలాగే పాఠశాలలను పర్యవేక్షించడానికి.. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికత, సెంట్రలైజ్‌డ్ డాష్‌బోర్డు లాంటివి కూడా రూపొందించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోట్‌బుక్స్, అలాగే యూనిఫాం పంపిణీ లాంటి వాటిని కూడా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రం విద్యాశాఖ అధికారుల నియంత్రణలో ఉండనుంది.అలాగే విద్యార్థులకు ముఖ గుర్తింపుతో హాజరు తీసుకునే విధానం కూడా ఈ వారంలో ప్రారంభించునున్నారు.

ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పనిచేసే డీఎస్‌సీఎఫ్‌ఆర్‌సీ పేరిట విద్యాశాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇందులో ఒకేసారి విద్యార్థుల కన్ను, కనురెప్ప, ముక్కు వంటి 70 రకాల ఫేషియల్ పాయింట్లను నమోదు చేయనున్నారు. హెడ్ మాస్టల్ లేదా ఉపాధ్యాయుడు తమ స్మార్ట్‌ఫోన్ యాప్‌లో విద్యార్థుల ముఖం చూపితే హాజరు నమోదవుతుంది. దీని సాయంతో ఒకేసారి తరగతి గది 15 నుంచి 20 మంది హాజరు తీసుకోవచ్చు. ఒకటో తరగతిలో విద్యార్థి ఫేషియల్ పాయింట్లు తీసుకుంటే వారు డిగ్రీ చదివే వరకు ఇది పనిచేస్తుంది. అయితే ఈ విధానాన్ని పాఠశాలలతో సహా కేజీబీవీలు, మోడల్‌స్కూళ్లు, గురుకులాల్లో కూడా అమలుచేయనున్నారు. పాఠశాలలో సీసీటీవీ కెమెరాలను కేంద్రానికి అనుసంధానం చేయడంతో ఇకనుంచి రాష్ట్రంలో ఉండే పాఠశాలలు నిఘాలో ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.