- మతాంతర వివాహం చేసుకున్న ప్రవీణ, జిలానీ
- పోలీసులు రక్షణ కల్పించకుండా రోజా ఒత్తిడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు
- తమకు ఏదైనా జరిగితే రోజానే బాధ్యత వహించాలని వ్యాఖ్య
ఏపీ మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఒక ప్రేమ జంట ఆందోళన వ్యక్తం చేసింది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు.
అంతేకాదు ప్రవీణకు పెళ్లి సంబంధాలను చూడటం ప్రారంభించారు. దీంతో, ప్రవీణ ఇంటి నుంచి వెళ్లిపోయి, జిలానీని పెళ్లి చేసుకుంది. అయితే, తమకు రోజా నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తమకు రక్షణ కల్పించకుండా రోజా ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తమకు ఏదైనా జరిగితే రోజానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు డీజీపీకి వారు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.