అందుకే కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
బంగారంపై బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ కోత కొను గోలుదారుల్లో సంతోషం నింపగా.. ఇప్పటికే భారీగా కొను గోలు చేసిన మదు పరుల్లో కలవరం రేపింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకే పుత్తడిపై పట్టు సడలించినట్లు చెబుతోంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ స్మగ్లింగ్‌ను అడ్డుకొనేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. నగల ఎగుమతిదారుల వ్యాపారాలను ఇది పెంచుతుందన్నారు. ఆయన ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ ‘బంగారంపై దిగుమతి సుంకం 6శాతానికి తగ్గించడం.. నగల ఎగుమతి వ్యాపారులకు కలిసొచ్చే అంశం. దీంతోపాటు అక్రమ రవాణకు కూడా అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాదు.. పుత్తడి ధర ప్రస్తుతం అత్యధికంగా ఉంది..
పెళ్లిళ్ల సీజన్ వస్తోంది. దీంతో ప్రజలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహకాలు లభించిన్లటైందని అభిప్రాయపడ్డారు. మూలధన వ్యయాలు పెరిగితే ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. అది లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించడంతో పాటు తయారీ, ఎగుమతుల పెంపునకు ఉపయోగపడుతుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై తమ శాఖ నుంచి చాలా సలహాలు కార్యదర్శుల కమిటీ ఎదుట ఉంచామని గోయల్ వెల్లడించారు. ఎఫ్‌డీఐలకు అవసరమైన అనుమతులు వేగంగా ఇచ్చేలా సరళీకరించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
కొన్ని రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐలకు అనుమతులు ఇచ్చే అంశాన్ని తమ శాఖ పరిశీలిస్తోందన్నారు. ఇది చాలా అంశాలు కలగలిసిన విషయం.. మేం ఆర్థిక శాఖకు పంపుతాము. ఆ తర్వాత మంత్రిమండలి ముందుకు తీసుకొస్తాం అని గోయల్ పేర్కొన్నారు. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్‌లో తగ్గించారు. పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి కుదించారు. తాజా సవరణతో బంగారంపై చెల్లించే పన్ను 11 శాతానికి తగ్గింది. అగ్రిసెస్ సెస్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఇక ప్లాటి•నమ్, పల్లాడియం, ఓస్మియుమ్, రుథేనియం, ఇరీడియంపై 15.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు.