చింతమడకలో వోటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు
దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సోమవారం సిద్ధిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడకలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ వోటు హక్కును వినియోగించుకున్నారు. హెలీకాప్టర్‌లో చింతమడక గ్రామానికి చేరుకున్న కేసీఆర్ దంపతులు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 13లో వోటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ బూత్‌లోకి కేసీఆర్ వెళ్తున్న క్రమంలో గ్రామస్తులకు అభివాదం చేస్తూ వెళ్లారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…పార్లమెంటు ఎన్నికల్లో ఏ కూటమికి మెజారిటీ సీట్లు రావని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతుందనీ, 65 శాతానికి మించి పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ రాకతో చింతమడకలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.