A place where you need to follow for what happening in world cup

తెలంగాణలో సరికొత్త శక్తిగా బిజెపి

0 289

ఈ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు ికాంగ్రెస్‌ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం
 రేవంత్‌ రాహుల్‌ కుటిల యత్నాలను జనం పట్టించుకోలేదు
 రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి బీజేపీకి సానుకూల స్పందన
 మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 13 : లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో సరకొత్త శక్తిగా బీజేపీ అవతరించనుందని, రాష్ట్రంలోని అన్ని నియోకవర్గాల్లో తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నట్లు సమాచారం అందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. నాలుగో విడత పోలింగ్‌ పూర్తయిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేంలో ఆయన మాట్లాడారు. తెలంగా ణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ లో ఇలాంటి దేశంలో ఎన్నికలు పండగలాంటివని అన్నారు. అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వోటు వేశారని,
వోటు వేసిన ప్రజలకు, అధికారులకు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌ లో సెలబ్రిటీలు కూడా క్యూలో నిలుచుని వోటేశారని ఇది మంచి సందేశమని కొనియాడారు.  ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం బలపడటానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపపడ్డారు.గత 2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.7%  పోలింగ్‌ శాతం నమోదైందని,  ఈసారి 65% దాటుతుందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి బీజేపీకి సానుకూల స్పందన వచ్చిందని, గ్రామీణప్రాంతాల్లో ప్రజలు  పార్టీలకు అతీతంగా..మోదీకి అండగా  నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి  బీజేపీకి మద్దతుగా నిలిచారని తెలిపారు.  పట్టణప్రాంతాల్లో పోలింగ్‌ శాతం కాస్త తగ్గినా.. పోలైన వోట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఓటింగ్‌ తగ్గటానికి చాలా కారణాలున్నాయని, చాలామంది ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు వెళ్లడం, తదితర కారణాలతో వోటింగ్‌ తగ్గిందని తెలుస్తోందని చెప్పారు. .

ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అన్నిపార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కాదన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ కుటిలయత్నాలను ప్రజలు పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,  ఆ పార్టీ కార్యకర్తలే  మాటలను సీరియస్‌ గా తీసుకోలేదు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా బీజేపీకి అనుకూలంగా ఉందని భావిస్తున్నా. మేము ముందుగా  చెప్పినట్లుగా.. ఈ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయి.

మా పార్టీ అభ్యర్థులపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు వారి  నాయకుల మాటలను పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ నేతృత్వంలో వివిధ యాత్రలు చేశాం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు..  అనంతరం పార్లమెంటు ఎన్నికలకు శ్రమించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని కిషన్‌ రెడ్డి అన్నారు.
ఈ పోలింగ్‌ తో  బీజేపీ తెలంగాణలో కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని, కేంద్ర పార్టీ అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి జేపీ నడ్డా  నాయకత్వంలో సంపూర్ణ సహకారం లభించిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్రప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని తెలిపారు. సమ్మక్క, సారక్క యూనివర్సిటీ, పసుపు బోర్డు, టెక్స్‌టైల్‌ బోర్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను మోదీ తెలంగాణకు ఇచ్చారని, త్వరలోనే వీటిని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు.

సమ్మక్క సారక్క యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ లో ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభించుకోబోతున్నామని, చిన్న చిన్న భూ సమస్యలున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తే..  శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం ప్రారంభించుకుంటామని కిషర్‌ రెడ్డ పేర్కొన్నారు. .
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని, ప్రతి దానికి మోదీని చాలెంజ్‌ చేస్తున్నారని, వాళ్ల నాయకుడికే స్థిరత్వం లేదు. వాళ్లు మమ్మల్ని ప్రశ్నించడం హాస్యాస్పదమని, ఎవరైనా తమ స్థాయిని చూసుకుని సవాల్‌ విసిరితే బాగుంటుందని హితువు పలికారు. ఎవరేమిటి అనేది జూన్‌ 4న తెలిసిపోతుందని, డబ్బులు ఖర్చుపెట్టినా, దుష్ప్రచారం  చేసినా..  ప్రజలు  హర్షించరని, తమకు అబద్ధాలు మాట్లాడే అవసరం లేదన్నారు.

వోటింగ్‌ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్‌ లో బీజేపీ విజయం సాధిస్తుంది. అందులో అనుమానం లేదన్నారు. అర్బన్‌ ఏరియాలో వోటరు లిస్టుకు సంబంధించిన సంస్కరణలు జరగాలని .వోటరు లిస్టును ప్రభుత్వం తనిఖీ చేయాలని, చనిపోయిన వోటర్ల పేర్లు ఇచ్చినా తొలగించలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో.. వేల వోట్లను తొలగించారని, వేల వోట్లను తొలగించిన జాబితాను పోలింగ్‌ ముందు రోజు రాత్రే తమకు ఇచ్చారని తెలిపారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగిందని ఆరోపించారు. వోటరు కార్డను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. . తమ ఇంట్లో తన వోటు ఒక దగ్గర, తమ బాబు వోటు మరో చోట ఉందన్నారు.  రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి  నేతృత్వం వహించినన్ని  రోజులు బీజేపీకి దోఖా లేదని, కాంగ్రెస్‌ పార్టీకోసం మజ్లిస్‌ కార్యకర్తలు పనిచేశారని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.