A place where you need to follow for what happening in world cup

చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

  • రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్‌ నమోదు
  • హైదరాబాద్‌లో ఉద్రిక్తత…ఎన్నికలు బహిష్కరించిన లచ్చగూడెం
  • బీర్పూరులో మధ్యాహ్నానికే వంద శాతం వోటింగ్‌ నమోదు

దేశంలో నాల్గవ విడత పార్లమెంటు ఎన్నికలు సోమవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో  కడపటి సమాచారం మేరకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంమీద 61.16 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు తెలుస్తున్నది. గత పార్లమెంటు ఎన్నికలకన్నా ఈసారి తక్కువ పర్సంటేజ్‌ నమోదు అయింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 62.11 శాతం వోటింగ్‌ నమోదు అయిన విషయం తెలిసిందే. కాగా  రాష్ట్రంలో అత్యల్పంగా వోటింగ్‌ శాతం నమోదు అయిన పార్లమెంటు నియోజవర్గంగా హైదరాబాద్‌ నిలిచింది. గత ఎన్నికల్లో  నలభై శాతం వోట్లు పోల్‌ కాగా ఈసారి 39.17 శాతం మాత్రమే నమోదు కావడం విశేషం. అలాగే అత్యధిక పోలింగ్‌ శాతం నమోదు అయిన పార్లమెంటు నియోజకవర్గంగా భువనగిరి నిలిచింది. భువనగిరిలో 72.34 శాతం వోటింగ్‌ నమోదు అయింది.  కాగా రాష్ట్రంలో గత ఎన్నికల్లో నమోదు అయిన వోటింగ్‌ శాతాన్ని పరిశీలించినప్పుడు ఒక్కో ఎన్నికు వోట్లు వేసే వారి సంఖ్య తగ్గుతూ వొస్తున్నది.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో ఇది నాల్గవది. 2014లో 76.52 శాతం వోటింగ్‌ జరగ్గా, ఆ తర్వాత 2015లో జరిగిన ఉప ఎన్నికలో 68.05 శాతం మాత్రమే వోట్లు పోలైనాయి. అలాగే 2019లో అంతకన్నా 12శాతం తక్కువగా 63.65 శాతం వోట్లు పోలైనట్లు రికార్డు అయింది. ఈ ఎన్నికల్లో అంతకు తక్కువగా 61.16 శాతం వోటింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఒకటి రెండు చెదురుమదురు సంఘటనలు మినహా వోటింగ్‌ ప్రశాంతంగానే ముగిసాయి. అయితే హైదరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం వోటింగ్‌ మరో గంటలో ముగుస్తుందనగా అలజడి మొదలైంది. అక్కడ ఎంఐఎంకు బిజేపీ అభ్యర్థికి మధ్య హోరాహోరి పోటీ కొనసాగుతున్నది. అనుకోకుండా ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎదురుపడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిరది.

తనపై దాడిచేసేందుకే ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ గుమికూడారని బిజెపి అభ్యర్థి డాక్టర్‌ మాధవీలత ఆరోపించింది. కాగా పోలీసుల జోక్యంతో ప్రశాంతవాతావరణం ఏర్పడినప్పటికీ, మాధవీలత ముస్లిం మహిళల నకాబ్‌ను పరిశీలించిందన్న ఆరోపణపై ఆమెపై మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా నారయణఖేడ్‌లో బిజెపి, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ, జనగామలో బిజెపి, బిఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఘర్షణ కొద్దిసేపు ఉద్రిక్తతకు దారిదీసింది.  ఇదిలా ఉండగా షెక్‌పేటలో తమ వోట్లు తొలగించారని వోటర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తంచేయగా,  కొత్తగూడ జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడలో తమ గ్రామ సమస్యలు పరిష్కరించేవరకు తాము వోటింగ్‌లో పాల్గొనేదిలేదని గ్రామస్తులు బీష్మించుకుని కూర్చున్నారు. తమ గ్రామానికి సాగు, తాగు నీరు సమస్యఉందని, ఎంతోకాలంగా తాము వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.

అదే విధంగా నాగర్‌కర్నూల్‌లోని బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు కూడా ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో మైనింగ్‌ ఎన్‌ఓసి అనుమతులను రద్దుచేయాలని వారు డిమాండ్‌ చేశారు. కాగా జగిత్యాల జిల్లా బీర్పూరు మండలం చిన్న కోయిల్‌వాయిలో మధ్యాహ్నానికే వంద శాతం పోలింగ్‌ కావడం ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం. రాష్ట్రంలో పలు జిల్లాలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీగా కురిసిన వాన ఎన్నికల సిబ్బందిని ఇబ్బందిపాలు చేసింది. పలు గ్రామాల్లోకి వెళ్ళాల్సిన సిబ్బందికి వర్షం తీవ్ర అవరోదంగా నిలిచింది. గ్రామాల్లోకి వెళ్ళేందుకు సరైన రవాణా సౌకర్యంలేకపోవడం, మధ్య రాత్రి వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. అయినా సోమవారం ఉదయంకల్లా అంతా సద్దుమణగటంతో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఇవీఎంలు కాస్తా మొరాయించిన, వాటిని మార్చడమో, బాగుచేయడంతోనో కాస్తా ఆలస్యమైనప్పటికీ వోటింగ్‌కు పెద్దగా ఆటంకం జరుగలేదని తెలుస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.