రౌంట్ టేబుల్ సమావేశంలో కమిషనర్ సివి ఆనంద్
డీజే శబ్దాలు శృతి మించిపోతున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సి ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజేపీలు, టపాసుల వినియోగంపై ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వొస్తున్నాయన్నారు. డీజేలతో నివాసాల్లో వృద్ధులు ఇబ్బందులుపడుతున్నారని.. గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారన్నారు.
గణేష్ ఉత్సవాలతో పాటు మిలాద్ ఉన్ నబీ సమయంలోనూ డీజేలతో నృత్యాలు విపరీతమయ్యాయన్నారు. పబ్‌లలో నృత్యాలు చేసినట్లు ర్యాలీల్లో చేస్తున్నారనన్నారు. ఈ డీజేలను నియంత్రించకపోతే ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. డీజేలను కట్టడి చేయాలని అనేక సంఘాలు ఫిర్యాదు చేశాయన్నారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలను తీసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని.. అందుకే అన్ని వర్గాలను సమావేశానికి ఆహ్వానించామన్నారు. అందరి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని.. ఆ తర్వాత సర్కారు చర్యలు తీసుకుంటుందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.