తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్‌ఘఢ్ కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్ ధృవీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని చోటెబైతీయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఆ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అలాగే భారీగా ఆయుధాలను కూడ స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టులలో అగ్రనాయకులు కూడ ఉన్నట్లు సమాచారం. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు బిఎస్‌ఎఫ్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. వారి చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు.
జరిగిన కాల్పుల్లో మరి కొంతమంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా మృతదేహాల కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సోమవారం నాడు మావోయిస్టులు భేస్ క్యాంపుపై బాంబుల వర్షం కురిపించారు. మావోయిస్టులు ఈ అటవీ ప్రాంతంలో ఉంటారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ సంఘటన మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది.ఘటనపై బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజి) సుందర్‌రాజ్ పి మాట్లాడుతూ…సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండగానే 29 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇన్‌సాస్, ఏకే 47 రైఫిల్స్, ఎస్‌ఎల్‌ఆర్, కార్బైన్, 303 రైఫిల్స్‌తో సహా భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని కూడా సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల్లో అగ్రనేత శంకర్‌రావు తలపై రూ.25 లక్షల రివార్డు ఉందన్నారు.