బిజెపి అధికారంలో ఉంటే అంకుశం దింపేది
కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య
విదేశాల్లో మన ఈసీపై విమర్శలా..అంటూ రాహుల్ గాంధీపై మండిపాటు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సిఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు. కేసీఆర్ దిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వొచ్చారన్నారు. బీజేపీ అధికారంలోకి వొస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లమని అన్నారు. అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేదన్నారు. కేసీఆరే దశమ గ్రహమని, నవగ్రహాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్‌కు ‘నో ఎంట్రీ బోర్డు’ పెట్టేశారని…ఇగ రీ ఎంట్రీ కలే అంటూ విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’ లాడుతున్నరని మండిపడ్డారు.
దేశ ప్రజలారా…కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను తాను సన్మానిస్తానని…ఈసారి జీహెచ్‌ఎంసీ మేయర్ బీజేపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యమన్నారు. లౌకికవాదులారా…. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరని అడిగారు. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు తన దృష్టిలో భారతీయులే కాదన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా కేంద్ర మంత్రి విరుచుకుపడ్డారు. రాహుల్…. క్విట్ ఇండియా అంటూ వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.