- ఉచిత హామీలకు తాను వ్యతిరేకమన్న మాజీ ఉప రాష్ట్రపతి
- హామీలు నెరవేర్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయా? లేదా? చూసుకోవాలని సూచన
- ప్రధాని ఉచిత ఆహార ధాన్యాల పంపిణీపై హర్షం
ఎన్నికల్లో ఉచిత హామీలకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చగలమా? లేదా? అందుకు తగిన ఆర్థిక వనరులు ఉన్నాయా? అని అంచనా వేయకుండానే పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తుంటాయని విమర్శించారు. దేశంలో పేద, మధ్య తరగతి, అంతకంటే దిగువన ఎంతోమంది జీవిస్తున్నారని పేర్కొన్న ఆయన.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ హామీపై మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని హామీని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ ఒక్క ఢిల్లీ ప్రభుత్వానిదే కాదని, కేంద్రంతోపాటు పక్క రాష్ట్రాలూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు.