హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల కోసం దశాబ్దకాలం తర్వాత ఓ వేదిక రూపొందడం చారిత్రక సన్నివేశమని, ఈ సందర్భం తెలంగాణ స్ఫూర్తిని చాటడంతో పాటు భవిష్యత్ తరాలకు ఓ దిక్సూచిగా మారాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. ఉద్యమ జర్నలిస్టుల పాత్రను చరిత్రలో నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉద్యమ అనుభవాలు, సాధించుకున్న విషయాలపై సమగ్ర చర్చ జరగాలని, అందుకు జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని అభిలాషించారు. తెలంగాణ ఉద్యమ సాధనలో ఎన్నోవిధాలుగా సమస్యలు ఎదుర్కున్న జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ‘తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ సమావేశం’ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది.
రాష్ట్రంలోని నలుమూలల నుంచి జర్నలిస్టులు తరలిరాగా..అందెశ్రీ విరచిత ‘జయ జయహే తెలంగాణ’తో సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు. జనంసాక్షి ఎడిటర్ ఎంఎం రహమాన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా పూర్వ లోకాయుక్త, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి(రిటైర్డ్) జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, సింగరేణి సకలజనుల సమ్మె కన్వీనర్ ఎండి మునీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…జర్నలిస్టుల్లో అనేకమంది చేదు అనుభవాలు చవిచూశారనీ, ఈ విషయం జర్నలిస్టు రఫీ కన్నీళ్లలో కనబడిరదని అన్నారు. అవి భావోద్వేగంతో వొచ్చినవే కాదు..ఎన్నో అంశాలు మనల్ని తడుముతున్నాయని అన్నారు. సమావేశానికి వొచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక్కో గాథ ఉందన్నారు. ఎవ్వరైనా స్వేచ్ఛను సమర్థించకూడదని, సమర్థిస్తే అది నిరంకుశానికి దారితీస్తుందని హెచ్చరించారు.
డిసిప్లేన్డ్ పొలిటికల్ పార్టీ పేరిట మంత్రులను సైతం బొమ్మలుగా మార్చేశారని విమర్శించారు. సంస్కారం, నమత్ర కావాలని కోరుకున్నారు కాబట్టే ప్రభుత్వాన్ని మార్చేశారని వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన రోజే తెలంగాణ ప్రజల మీదినుంచి బరువు దిగిపోయిందని కోదండరామ్ అనడం గత పాలనకు అద్దం పడుతుందని వివరించారు. స్వేచ్ఛకు ఉండే ప్రాముఖ్యతను గుర్తించినందుకే జర్నలిస్టులంతా ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారని, ఈ వేదికను బలోపేతం చేసుకుని కమిటీని రూపొందించుకోవాలని సూచించారు. ఉన్నవాళ్లందరినీ ఏకతాటిపైకి తేవాలన్నారు. ప్రతిసారి గత 70ఏళ్ల చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదని, 2014 తర్వాత జరిగినదే చర్చలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ పదేళ్లలో ఎవరు బాగుపడ్డారు…ఎవరి కడుపులు నిండాయో గుర్తించాలన్నారు. ఈ అంశాన్ని చరిత్రగా రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులకు నివాసమే కాదు, ఎలాంటి భద్రతా లేదన్నారు. మనుగడ ఎలా సాగించాలన్న సవాల్‌ను అధిగమించేందుకు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యాచరణలో జర్నలిస్టుల వెంట తాముంటామని, ఎంతవరైనా పోరాడుతామని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ఈ సమావేశాన్ని చూస్తే నిరంకుశత్వం ఇంతమందిలో ఉన్నదా అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు. ఈ నిరంకుశత్వాన్ని పోగొట్టడం కోసం కీలకమైన పాత్ర ఇప్పుడే మొదలైందన్నారు. సమష్టి వనరులను ఎవరు కొల్లగొట్టారో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు సర్కారు వద్దకు ఫైళ్లకు సరైన పరిష్కారం లేదని, వాటి గురించి అడిగే ధైర్యమూ ఎవరికీ లేకపోయిందని చెప్పారు. ఇన్నిరకాల నియంతృత్వంపై గ్రంథస్థం చేయాలని, ఒక వ్యక్తి ఆధిపత్యానికి దారితీసిన పరిస్థితులను మననం చేయాలని చెప్పారు. స్వేచ్ఛను ఆస్వాదించాలి..అణిచివేతను అధ్యయనం చేయాలన్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల ద్వారా వాట్సప్ కాల్ నిషేధించామని కొందరు చెప్తుండటం గమనించాల్సిన విషయమన్నారు. ముళ్లకంచెలను తొలగించినప్పుడు బెర్లిన్ గోడను కూలగొట్టినంత ఆనందం కలిగిందన్నారు. ఆలోచిస్తే ఇలాంటివెన్నో తారసపడతాయన్నారు. ఈ కొత్త వేదిక కోసం ఒక ప్రత్యేక కమిటీ వేసుకోవాలని, సమన్వయంతో సాగాలని సూచించారు. ఇప్పటి తెలంగాణ పునర్నిర్మాణంలో పాత్రులు కావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సాధించిన విషయాల్ని రికార్డు చేయడంతో పాటు అన్నిటిపైనా చర్చ చేయాలని సూచించారు.
జర్నలిస్టులు కీలక బాధ్యతలు నిర్వర్తించాలి.. యూనియన్ల పనితీరును వెలుగులోకి తేవాలన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కోసం వేదిక అవసరం ఉందని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. గతంలో అనేక సందర్భాల్లో, అనేక వేదికలపై సీఎం కేసీఆర్ తన అహంకారాన్ని ప్రదర్శించినా ఎవ్వరూ నిరసన తెలిపిన పాపాన పోలేదన్నారు. జర్నలిస్టుల్లో ఉద్యమ స్ఫూర్తి కొరవడిరదని ఇలాంటి ఉదంతాలు గుర్తుచేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ఉద్యమ జర్నలిస్టుల పాత్ర ఎలాంటిదో నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదివరకు కొంత జరిగినా సమగ్రత రాలేదన్నారు. దేశ ఉనికి కోసం చరిత్ర రాసుకున్నాం కానీ, తెలంగాణ విషయంలో ఇప్పటివరకు జరగకపోవడం బాధాకరమని, ఇకనైనా మొదలుకావాలని ఆకాంక్షించారు. నిర్బంధం మీద డాక్యుమెంటరీ తీసుకురావాలని కోరారు. ఈ కార్యాచరణలో భాగస్వామ్యం చేయడం తన అదృష్టమన్నారు. అనంతరం తాటికొండ రమేష్ బాబు తీర్మానాలను ప్రవేశపెట్టగా..జర్నలిస్టులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణలో భాగంగా తాత్కాలిక కన్వీనర్‌గా ఎంఎం రహమాన్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, కందుకూరి రమేష్ బాబు, సీనియర్ రిపోర్టర్ మల్లయ్య గౌడ్, సుదర్శన్, పీఎస్ రవీంద్ర, రఫీ, పసునూరి రవీందర్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.