విశాఖపట్టణం, ఆగస్టు 3:ఈ నెల 10వ తేదీ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత ప్రారంభం కాబోతుంది. విశాఖపట్నం నగరంలో ఈ యాత్ర మొదలవుతుంది. అదే రోజు పట్టణంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహిస్తారు. ఇదే నెల 19వ తేదీ వరకూ ఈ యాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన అంశాలపై పవన్ కల్యాణ్ చర్చిస్తారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే టూర్ ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొనసాగనుంది ఏయే నియోజకవర్గాల్లో పర్యటించేది త్వరలో ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ జిల్లాలో జనసేనకు కేడర్ కూడా బాగానే ఉంది.
దీంతో విశాఖ నుంచి టూర్ మొదలుపెట్టాలని పవన్ నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. వారాహి విజయ యాత్ర ద్వారా జనసేన లో కొత్త ఊపు తెచ్చారు పవన్ కళ్యాణ్.మొదటి విడతలో 10 నియోజకవర్గాలు,రెండో విడతలో 5 నియోజకవర్గాల్లో పర్యటించారు. మూడో విడతలో కూడా ఇదే తరహాలో ముందుకెళ్లనున్నారు.ఆగస్ట్ 10వ తేదీన విశాఖపట్నంలో వారాహి వాహనం నుంచి బహిరంగ సభ లో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయని జనసేన పార్టీవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పర్యావరణాన్ని ధ్వంసం చేసిందంటున్న పవన్ కళ్యాణ్. ఆయా ప్రాంతాలను సందర్శించనున్నారు. విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర లో పలు నియోజకవర్గాల్లో పవన్ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. మూడో విడత యాత్ర విజయవంతం చేయడంపై ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు.
మొదటి రెండు విడతల కంటే మూడో విడత మరింత భారీగా నిర్వహించాలని నాయకులకు సూచించారు. జనసైనికులు,వీరమహిళలు కలిసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనోహర్ తెలిపారు.మొదటి రెండు విడతల యాత్రలో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు జనసేన చీఫ్. ఆయా నియోజకవర్గాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలపై పలు ఆరోపణలు చేశారు. ఇక సీఎం జగన్ పై ఒంటి కాలితో లేచారు పవన్ కళ్యాణ్. మూడో విడతలో ప్రభుత్వంపై విమర్శల స్థాయిని మరింత పెంచుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల విషయంలో పవన్ వ్యాఖ్యలు. ఆ తర్వాత పవన్‌ను ప్రాసిక్యూట్ చేయాలంటూ జీవో ఇవ్వడం వంటి అంశాలను మూడో విడతలో లెవనెత్తుతారని అంటున్నారు.
ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత మౌనంగా ఉన్నారు పవన్. బీజేపీతో చెలిమి, టీడీపీతో పొత్తుల వ్యవహారంపై కూడా ఈ యాత్రలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి పవన్ వారాహి యాత్ర షెడ్యూల్ విడుదలతో మరోసారి వైసీపీ-పవన్ మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం కనపడుతుందిపర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారు. అలాగే విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.అంతకు ముందే వారాహి విజయ యాత్ర మూడో విడతకు సంబంధించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మూడు కమిటీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. యాత్ర నిర్వహణలో జాగరూకతతో ఉండాలని సూచించారు.