అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికి అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో నేటికీ అధికార బీఅర్ఎస్ మినహా కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు మిగిలిన పార్టీల అభ్యర్ధులు నేటికీ ఖరారు కాలేదు. ఒక పక్క బీఅర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ప్రచారంలో దూసుకుపోతుంటే మిగిలిన పార్టీల అభ్యర్థులు టికెట్ దక్కేలా తమ తమ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలలో ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో ఈసారి అధికార పార్టీకి గట్టి పోటీ నిస్తాయని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు మాత్రం నేటికీ టికెట్ల వేటలోనే ఉండడంతో వారి వారి అనుచర గణం అయోమయం లో ఉన్నారు. ఈసారి బోథ్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపేలా తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలలో తీవ్ర పోటీ
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. దీనితో ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో నిలిస్తే కచ్ఛితంగా విజయం సాధించవచ్చని పలువురు నేతలు భావించడంతో పోటీ పెరిగింది. దీనితో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి సవాలుగా మారింది. బోథ్ నియోజకవర్గం నుండి 16 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ మాత్రం ప్రధానంగా జాదవ్ నరేష్, అడే గజేందర్, వన్నెల అశోక్, పార్వతి రాథోడ్ ల మధ్య ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ నుండి అదిలాబాద్ ఎంపీ గా కొనసాగుతున్న సోయం బాపురావ్ సైతం కాంగ్రెస్ పార్టీ లో చేరి బోథ్ ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇటీవలే తాను బీజేపీ నుండి ఎమ్మెల్యే గా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్న పరిణామాల పరంగా చూస్తే జాదవ్ నరేష్, అడే గజేందర్, వన్నెల అశోక్, రాథోడ్ పార్వతి లలో ఎవరికో ఒక్కరికీ టికెట్ దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందిగ్ధత తొలగాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే.
ఈ సారి తెలంగాణలో ఎలాగైనా పాగ వేయాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ పార్టీ లో కూడా టికెట్ ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఎంపీ గా కొనసాగుతున్న సోయం బాపురావుకు ఎమ్మెల్యే గా పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన పోటినుండి తప్పుకుంటే సాకటి దశరథ్, ఆడే మానాజి తో పాటు రాష్ట్ర జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు జాదవ్ బలరాం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాక గెలుపు ఓటములపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కలదనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.