- ఉత్కంఠకు తెరదింపిన ఏఐసీసీ
- 7న సీఎంగా ప్రమాణస్వీకారం
- తెలంగాణ మూడో సీఎంగా రేవంత్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఎంపికయ్యారు. సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 4న హైదరాబాద్లో సీఎల్పీ మీటింగ్ జరిగిందనన్నకేసీ.. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసిందని వేణుగోపాల్ వెల్లడించారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. మరోవైపు సీఎం రేసులో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిలను మంగళవారం ఉదయమే ఏఐసీసీ.. ఢిల్లీకి పిలిపించుకోగా డీకే శివకుమార్ వారిద్దరితో చర్చలు జరిపారు. అవి విఫలం కావడంతో రంగంలో దిగిన కేసీ సాయంత్రం ఇరువురు అసంతృప్తులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు.
తమకు అధికారాన్ని అప్పగించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీసుకున్నారని వేణుగోపాల్ వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో సీఎం ఎంపికపై చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు.