- ఇరువురు నేతల తీరు అనుమానాస్పదం
- రేవంత్ ను బలహీన పరచే దిశగా అడుగులు
- పార్టీని అస్తిరత్వం పాలు చేసే ప్రయత్నం
- ద్విముఖ వ్యూహంతో అడుగులు
- తెలంగాణ జాతి ‘పీత’ వలలో సీనియర్లు
- ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ గులాబీ భజన బృందం ప్రచారం
ఓటమికి దారి తీసిన పరిస్థితులను సమీక్షించుకోవడం ద్వారా రాబోయే కాలంలో పార్టీ పనితీరు మెరుగు పరచుకుని ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించాల్సిన గులాబీ పార్టీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అస్థిర పరచడంతో పాటు ప్రజాకర్షక నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డిని బలహీనపరచే దిశగా అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులుగా ముద్ర పడిన ఇద్దరు నాయకుల సహకారంతో తన పనిని పూర్తి చేసుకునే విధంగా మాజీ నేత పావులు కదుపుతున్నారు. గెలిచిన పార్టీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే
విష ప్రచారానికి తెర లేపారు. ఆరు నెలల్లో తామే అధికారంలోకి వస్తామంటూ గడీలోని భజనపరులు ప్రచారంమొదలు పెట్టారు. గత తొమ్మిదేండ్లుగా కోవర్టులుగా కాంగ్రెస్ పార్టీలో పేరు తెచ్చుకున్ననేతలకు అధికార పార్టీ నేత నుంచి భారీగా ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ యజమాని, ఒక బడా కాంట్రాక్టర్ ద్వారా వీరికి నిధులు సమకూరుతున్నాయని కొందరు కాంగ్రెస్ నేతల వద్ద పక్కా సమాచారం ఉన్నది. ఇద్దరు ముఖ్య నాయకులను బయటికి పంపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ బాగు పడుతుందని రాహుల్ గాంధీ కూడా ఒక దశలో అన్నారనే వార్తలు వచ్చాయి. కోవర్టుల వ్యవహారం ఏఐసీసీ నేతల దృష్టిలో ఉందని పార్టీ నేతలే అంటున్నారు. కోవర్టు నేతల్లో ఒకరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు కాగా మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కోవర్టు నేతలు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమంటూ రంగంలోకి దిగారు. రేవంత్ కు మోకాలడ్డుతున్నారు. విజయం సాధించిన శాసనసభ్యుల్లో 50 మందికి పైగా రేవంత్ వైపే మొగ్గు చూపినా వారు తమ ప్రయత్నాలను ఆపలేదు. తానొక్కడినే ఉపముఖ్యమంత్రిగా ఉండాలని ఖమ్మం జిల్లా నేత పట్టుబడుతుండగా తాము చెప్పిన వారికే మంత్రి పదవులు కట్టబెట్టాలని, కీలక శాఖలను కేటాయించాలనే డిమాండ్లను నల్లగొండ నేతలు ముందుకు తెచ్చారు. ముగ్గురు నేతల్లో ఇద్దరు గులాబీ నేతతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. కోవర్టులుగా మారిన ఇరువురు నేతల్లో ఒకరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి కారకుడు కాగా మరొకరు అసెంబ్లీలో కీలక పదవిని అలంకరించారు. గత ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, గులాబీ బాస్ సూచనల మేరకు బలహీన మైన నేతలకు టికెట్లు ఇప్పించడం ద్వారా నల్లగొండ జిల్లా నేత అప్రతిష్ఠపాలయ్యారు. అయినప్పటికీ ఏఐసీసీలో ఉన్న పలుకుబడితో తెలంగాణలో చక్రం తిప్పుతున్నారు. రాష్ట్ర పార్టీ పదవి నుంచి ఆయన్ని తప్పించినా గ్రూపు రాజకీయాలను పెంచి పోషిస్తూనే ఉన్నారు. తన సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారంతా గులాబీ కండువా కప్పుకున్నా వారిని వారించే ప్రయత్నాలు కూడా చేయకుండా మౌనం వహించి పరోక్షంగా అధికార పార్టీకి
సహకరించిన నేతగా ఖమ్మం జిల్లా నేత అపకీర్తి మూట కట్టుకున్నారు.

అసెంబ్లీలో పాలక పక్షాన్ని నిలదీయడంతో విఫలమయ్యారని పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. రేవంత్ వ్యతిరేక కూటమి ప్రోత్సాహంతో పాద యాత్ర చేపట్టినా ఆయన యాత్రకు ప్రజల స్పందన నామమాత్రంగానే ఉన్నదని స్పష్టమైంది. తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకునే ప్రయత్నం అడుగడుగునా చేస్తూ వచ్చారు. ఒక న్యూస్ ఛానల్ ఆయన్ని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నది. సొంత జిల్లాలో తన నియోజకవర్గం దాటి బయటికి వెళ్ళలేని నేతను రాష్ట్ర నాయకుడిగా చూపించడానికి కొందరు అస్మదీయులు నానా తంటాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల, పొంగులేటి కాంగ్రెస్ లో చేరక పోతే ఆ పార్టీ కేవలం ఒకటి రెండు సీట్లకే పరిమితమయ్యేది.
ప్రజాకర్షక నేత రేవంత్..

పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి అనతి కాలంలో ప్రజాకర్షక నేతగా ఎదిగి అధిష్ఠానం దృష్టిని ఆకర్షించారు. ప్రజల్లో ప్రత్యేకించి యువతలో రేవంత్ కు ఉన్న క్రేజ్ ను సోనియా, రాహుల్, ప్రియాంక ప్రత్యక్షంగా చూశారు. ప్రజాబలం కలిగిన ఇతర పార్టీ నేతలను, ఏ పార్టీలో లేని వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి పార్టీని విజయానికి తీరానికి చేర్చారు.రేవంత్ ముఖ్యమంత్రి అయితే రాబోయే కాలంలో తమకు నూకలు చెల్లినట్టేనని భావిస్తున్న ప్రతిపక్షాలు భారీ కుట్రకు తెరలేపాయి. అందుకే కొందరు శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి ముందుగానే ఈ కుట్రలను గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కీలక నేతల వలయంలో వారిని ఉంచారు. ప్రతిపక్షాల కుట్రలను, పార్టీలోని కోవర్టుల కదలికలను
గమనిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తే రేవంత్ మరింత బలపడతారని ఆయన వర్గం నేతలు అంటున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పారదర్శక పాలన చేపట్టడం, ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేయడం రేవంత్ ముందున్న సవాలుగా చెప్పవచ్చు. తన చర్యల ద్వారా అంతర్గత, బయటి శక్తులకు ధీటైన సమాధానం చెప్పే తరుణం ఆసన్నమైంది.
కొండూరి రమేష్ బాబు
మొబైల్.. 8332995398