- ఒక వ్యక్తి వద్ద రూ.50 వేలకు మించితే వాటికి సంబంధించి ఆధారాలు తప్పనిసరి
- రాజకీయపార్టీలు అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించవద్దు..
- రాజకీయ పార్టీలపై నిరంతర నిఘా ఉంటుంది..
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని, లేకపోతే చట్టప్రకారం చర్యలుంటాయని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో డిఎస్పి రవికుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా ర్యాలీలు లౌడ్ స్పీకర్లు పెట్టి, ఇతర సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు.పోలీసుశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా రూ.50 వేలకు మించి తీసుకెళ్తే అందుకు సంబంధించిన వివరాలను చూపించాల్సి ఉంటుందని తెలిపారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 326 పోలింగ్ కేంద్రాలుంటాయని, పోలింగ్ కేంద్రాల పరిధిలో 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 80 సంవత్సరాలు పైబడిన దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితులలో వారికి బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొని అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా గోడలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వ స్థలాల వద్ద ప్రచారం చేయవద్దని సూచించారు. నియోజకవర్గంలో మొత్తం 2,48,556 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.
ఇందులో స్త్రీలు 1, 23,722, పురుషులు 1,24,726 ట్రాన్స్‌జెండర్లు 8, సర్వీసు ఓటర్లున్నారని వెల్లడించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితంగా నామినేషన్ మొదలుకొని ఓట్లు లెక్కింపు వరకు ఖర్చుల వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు మోడల్ కోడ్ అమలు చేయడానికి నాలుగు రకాల టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల విధివిధానాలను తెలియజేయుటకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో . ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.