మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో పోలీసులు మరికొందరిని అరెస్టు చేశారు. తాజాగా ఎనిమిది మంది నిందితులను నార్కోటిక్ విభాగం పోలీసు అధికారులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు నైజీరియన్లతో పాటు మాదక ద్రవ్యాలు వాడుతున్న మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా అరెస్టు అయిన 8 మందిలో ఓ సినీ నిర్మాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మాదక ద్రవ్యాలు వాడే వారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్టసీ పిల్స్ ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించనున్నారు. గత నెల 31వ తేదీన నార్కోటిక్ విభాగం పోలీసులు గుడిమల్కాపూర్, మాదాపూర్ లో దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మాదాపూర్ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల, మేహక్ అనే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ, ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్ గా వెంకట్ పని చేసినట్లు గుర్తించారు. సినిమా ఫైనాన్సర్ వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరగుతుందని గుర్తించి రెయిడ్ చేశారు.
వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ కు డ్రగ్స్ మాఫియా పై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు.సినీ ఫైనాన్షియర్ వెంకట్ రత్నారెడ్డిపై తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కు పైగా కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. గతంలో ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు చేశారు. నిర్మాతలు సి. కల్యాణ్, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్ అధికారినంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. నిర్మాతల నుంచి రూ.30 లక్షలకుపైగా కొట్టేసిన వెంకటరత్నారెడ్డి.. పెళ్లి పేరుతోనూ యువతుల్ని మోసం చేసినట్లుగా గుర్తించారు. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేస్తూ.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు.పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్ రత్నారెడ్డి.. తన అక్రమాలకు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరును ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ కి డ్రగ్స్ మాఫియా తో లింకులు ఉన్నాయని పోలీసు విచారణలో బయటపడింది. తాజాగా ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్సర్ వెంకట్ రత్నా రెడ్డి వాట్సాప్ లో కీలక విషయాలు బట్టబయలయ్యాయి. బాలాజీ, వెంకట్ రత్నారెడ్డి కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్ ను అమ్మకాలు చేసినట్లు విచారణలో వెల్లడించారు బాలాజీ, వెంకట్. ఆ 18 మంది ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
పరారీలో నవదీప్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడంతో మొరసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఎంతోమంది స్టార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెల్సిందే. ఇక తాజాగా నేడు మరో సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతని నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. గుడి మల్కాపురం పోలీసులతో కలసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు పక్కాగా వలపన్ని ముగ్గురు నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నైజీరియన్ల సహాయంతో సుశాంత్ రెడ్డి డ్రగ్స్ దందా సాగిస్తూ పలువురికి విక్రయిస్తున్నారట.
ఇక ఈ డ్రగ్స్ కేసుపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి.. నిందితుల గురించి మీడియాకు తెలిపారు.“టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఉన్నా వాళ్లు బయటకు వస్తున్నారు. తాజాగా మదాపూర్లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాము.. అందులో ఐదుగురిని అరెస్టు చేసి వారివద్ద ఉన్న సెలఫోన్లు సీజ్ చేసాం. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుండి వచ్చిందనితెలిసింది .. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. నైజీరియన్లు వీసా గడవు ముగిసిన దేశంలో ఉన్నారు.. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ చెందిన వ్యక్తి ఉన్నారని సమాచారం.. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. మాజీ ఎంపీ కూమారుడు దేవరకొండ సురేష్ రావు అరెస్ట్ చేశాం.. హీరో నవదీప్ కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించాం.. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. త్వరలోనే వారిని పట్టుకుంటాం” అని ఆయన తెలిపారు.