ఎక్కడికక్కడ ఏఎన్ఎం ల అరెస్టులు, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు
జగిత్యాల:సెకండ్ ఏఎన్ఎం లను ఏలాంటి షరతులు లేకుండా సర్వీస్ లను క్రమబద్దికరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి ఏఎన్ఎం ల సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముట్టడిని బగ్నం చేయాలని తెలంగాణాలో అన్ని జిల్లాల్లో సెకండ్ ఏఎన్ఎమ్ లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ లకు తరలి చారు.జగిత్యాల జిల్లానుండి అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్లకుండా కోరుట్లలో రెండవ ఏఎన్ఎం ల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు గాండ్ల మధురిమ, బీరుపూర్, జగిత్యాల, వెల్గటూరు తదితర పోలీస్ స్టేషన్లో పలువురు ఏఎన్ఎం లను పోలీస్ స్టేషన్ లో ముందస్తు అరెస్టులు చేశారు.
ఈ సందర్బంగా సంఘాల నేతలు మధురిమ, పడాల మమతలు మాట్లాడుతూ 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న పురుష హెల్త్ అసిస్టెంట్ లను ఏ రకంగా అయితే ఎగ్జామ్ లేకుండా రెగ్యులర్ చేశారో అదేవిధంగా మాతో పాటు హెల్త్ అసిస్టెంట్ ( ఫిమేల్) నీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్లను, ఇబ్బందులను ఇప్పటికే చాలాసార్లు మంత్రులు హరీష్ రావు,కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ,పలువురు ఎమ్మెల్యేలను కలిసి విన్నవించిన ఏఎన్ఎంల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉన్నాయని వారు వాపోయారు.తమ విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి సెకండ్ ఏఎన్ఎంలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ మమ్మల్ని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని సంఘాల నేతలు గాండ్ల మధురిమ, పడాల మమతలు పేర్కొన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించి, రెగ్యులరైజ్ చేయాలని కోరారు.