- శ్రీకాళహస్తి సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
- రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో జనసేనానికి ఘన స్వాగతం
- 15 కిలోమీటర్లు భారీ ర్యాలీతో ఎస్పీ ఆఫీసుకు చేరుకున్న పవన్
జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగిన జనసేనానికి ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో 15 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకున్న పవన్.. సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలుసుకుని ఫిర్యాదు అందజేశారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నిర్వహించిన ఆందోళనలో సీఐ అంజూ యాదవ్ తీవ్రంగా రియాక్టయిన విషయం తెలిసిందే. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టె సాయిపై ఆమె చేయిచేసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. జనసైనికుల వెన్నంటి ఉంటానని, సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. సీఐ అంజూ యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.