- మానుకోట బహిరంగ సభ తోనే కాంగ్రెస్ సత్తా తేలిపోయింది..
- మానుకోటలో కాంగ్రెస్ కు మూడవ స్థానమే..
- మొదటిసారి వచ్చి సియం వట్టి చేతులు చూపించి వెళ్తారా..!
- పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం..
- మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
సాక్షాత్తు రాష్ట్రముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసభకు హాజరై.., జనం ఎవరు రాక., ఖాళీ కుర్చీలతో ఉన్న వేదిక వద్దకు వెళ్లలేక గంటకు పైగా బస్సులో కూర్చుని ప్రజలకోసం ఎదురుచూసే పరిస్థితి దాదాపుగా మహబూబాబాద్ లో తప్ప మరెక్కడ చూసి ఉండమని, ఈ సంఘటనతోనే పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఏమిటో తెలిసిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి తొలిసారిగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వస్తే జిల్లా ప్రజలకు, పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి వరాలు ఇస్తారోనని ప్రజలంతా ఎదురు చూశారని, కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇవ్వకుండా వట్టి చేతులు ఊపి వెళ్లిపోయారని ఎద్దేవా చేసారు.
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిగాని, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు గానీ ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి, ప్రజల అవసరాలను వివరించి కొన్ని హామీలైన పొందాల్సి ఉండేదని, కానీ వారికి ఆ..సమర్థత లేదని నిన్నటి బహిరంగ సభతో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం తప్ప నిర్మాణాత్మకమైన ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో చెప్పకపోవడం విచారకరమన్నారు. అప్పటికే సభకు జనం రాక అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాన్ని కదలించ లేక పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆగ్రహాన్ని మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలపై చూపారని, అందుకే ఒక్క హామీ, ఒక్క వరం కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారని సత్యవతి రాథోడ్ తెలిపారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహబూబాబాద్ నియోజకవర్గంలో మూడవ స్థానమే దక్కుతుందని నిన్నటి సభతో తేలిపోయిందన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో మరొక్కసారి గులాబీజెండా ఎగరవేస్తామని తెలిపారు. గతంలో మంజూరైన పనులకు సంబంధించిన నిధులను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, వాటినైనా తిరిగి విడుదల చేయాలని, అభివృద్ధిని అడ్డుకోవద్దని సత్యవతిరాథోడ్ కోరారు. ఈనెల 23వ తేదీన మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత మానుకోట కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారని, ఆ కార్యక్రమానికి పార్టీ ప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. అందరం ఒక్క కుటుంబంలో కలిసి పని చేస్తామని బిఆర్ఎస్ ను భారీ మెజారిటీతో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిపించుకుంటామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దానిని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల సాకులు చెబుతున్నారని ఆమె అన్నారు.
రైతులకు రుణమాఫీ అంశంపై ఇప్పటికే అనేక తేదీలు మారుస్తూ పోయారని, ఆగస్టు 15 కూడా అందులో ఒకటి అవుతుందని ఆమె జోస్యం చెప్పారు. బయ్యారం ఉక్కును దోచుకున్నది వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనేనని, బయ్యారం ఉక్కును కాపాడింది కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ అని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. కేంద్రం పైన అలుపెరగని పోరాటం బిఆర్ఎస్ నిర్వహించిందని, తీవ్రస్థాయిలో బిజెపి ప్రభుత్వంతో విభేదించిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీరు కనిపించేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటు చూసినా కరువే కనిపిస్తుందని, రైతుల ఆత్మహత్యలు విద్యుత్తు కోతలు మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలంటే, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని, ప్రశ్నించే గొంతుకగా తెలంగాణ వాదాన్ని ఢిల్లీ వేదిక పైన వినిపించే పార్టీగా టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. త్వరలోనే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ అధినేత కేసిఆర్ పర్యటన ఉంటుందని, బిఆర్ఎస్ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో విజయం కోసం సైనికుల పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బిఆర్ఎస్ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, కౌన్సిలర్ లు ఫరీద్, ఎడ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.