కురవి జడ్పిటిసి, బిఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లానాయకులు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రధాన అనుచరులలో ఒకరైన బండి వెంకటరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబాబాద్ లో మంత్రి సీతక్క జడ్పిటిసి బండి వెంకటరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. గత కొన్ని రోజులుగా జడ్పిటిసి బండి వెంకటరెడ్డి ఏ పార్టీలో చేరుతారు, అనే అంశంపై డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మంచి గుర్తింపు, కురవి మండలంలో బలమైన నాయకునిగా పట్టు ఉన్న బండి వెంకటరెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలు తీవ్రప్రయత్నాలు చేసాయి.
ఎట్టకేలకు తన అనుచరుల నిర్ణయం మేరకు బండివెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ..సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, వారితో కలిసి రానున్న రోజుల్లో పని చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కురవి మండల ప్రజల కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా బండి వెంకటరెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కురవి జెడ్పిటిసి బండి వెంకటరెడ్డిని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ తదితరులు స్వాగతించి అభినందించారు. త్వరలోనే కురవి మండలకేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి కురవి మండల వ్యాప్తంగా ఉన్న తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న ఆ..పార్టీ అభిమానులను ఎమ్మెల్యే రామచంద్రనాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తానని బండి వెంకటరెడ్డి తెలిపారు. బండి కాంగ్రెస్ లో చేరడంతో భారాసకు డోర్నకల్ నియోజకవర్గంలో మరోషాక్ తగిలినట్లయ్యింది.