A place where you need to follow for what happening in world cup

5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులు కల ఎట్టకేలకు నెరవేరింది. తెలంగాణలో 5089 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్ష-2023 జరుగుతుంది. పశ్నాపత్రాల లీకేజీ లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఆన్ లైన్ లో TRT పరీక్షలు జరపనున్నారు.ఈ క్రమంలో నోటిఫికేషన్‌ విడుదలపై తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులు విద్యాశాఖపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 6నే నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ బయట పెట్టకుండా జాప్యం చేసింది. రెండు రోజుల తర్వాత తీరిగ్గా విద్యాశాఖ అధికారులు నోటిఫికషన్‌ను బయటపెట్టారు. టీచర్‌ నియామక నోటిఫికేషన్ విడుదల లోనూ విద్యాశాఖ అధికారుల మొద్దు నిద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు ఎలాగూ సవ్యంగా నిర్వహించడం చేతకాదు కనీసం నోటిఫికేషన్‌ అయినా సకాలంలో ఇవ్వలేరా అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. మరికొందరేమో నోటిఫికేషన్‌ విడుదల చేయడానికే బద్దకించారు.. వీళ్ళా ఎగ్జామ్ నిర్వహణ చేసేది అంటూ ఫైర్ అయ్యారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 24 ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులున్నాయి. వీటన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టెట్‌ పరీక్షలోనూ అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏండ్ల లోపు ఉండాలి.ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 21, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతిఒక్కరూ రూ.1000 చెల్లించాలి.

Leave A Reply

Your email address will not be published.