ఆత్మహత్యాయత్నం చేసుకొని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ ఈ ఉదయం మృతి చెందారు. 70శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉన్నతాధికారుల వేధింపులు వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు మరణ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈక్రమంలోనే పోస్టుమార్టం నిమిత్తం రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మోర్చరీకి తరలించారు. హోమ్ గార్డు రవీందర్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోమ్ గార్డులకు అధికారుల వార్నింగ్ ఇచ్చారు. హోమ్ గార్డులు అందరూ డ్యూటీలో తప్పనిసరిగా ఉండాలని సూచించారు. డ్యూటీ లో లేని హోమ్ గార్డులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ లోనే ఉండాలని చెప్పారు. వీరంతా అందుబాటులో ఉండేలా ఇన్స్పెక్ట ర్లు చర్యలు తీసుకోవాలని.. లా అండ్ ఆర్డర్ లో పనిచేసే వారు సమ్మెకు పూనుకుంటే విధుల నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
హోంగార్డు రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత రెండు నెలల నుంచి రవీందర్‌కు జీతాలు రావడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి జీతం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి వివరించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన రవీందర్ గోషామహల్‌లోని హోంగార్డుల హెడ్ ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల గమనించి మంటలను ఆర్పివేశారు. రవీందర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌కు 60 శాతానికి పైగా గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి మరింత విషమించడంతో కాంచన్ బాగ్ లోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో శుక్రవారం ఉదయం అతడు మృతి చెందాడు.