A place where you need to follow for what happening in world cup

సీతక్క గ్రాఫ్ డౌన్..

  • అనుచరుల ఇసుక దందాతో అంటుతున్న మకిలి
  • అధికారులపై కాంగ్రెస్ నేతల ఒత్తిడి
  • కట్టడి చేయలేని మంత్రి
  • ఆదివాసీ సొసైటీల పేరుతో బినామీ కాంట్రాక్టర్ల స్వైర విహారం
  • గోదావరి పూడిక పేరుతో ముదురుతున్న వివాదం

సీతక్క పొలిటికల్ గ్రాఫ్ పడిపోతున్నదా? అనుచరుల ఇసుక దందాతో మకిలి అంటుతున్నదా?  ఇటీవలి పరిణామాలు చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. నక్సలైట్ గా అజ్ఞాత ఉద్యమంలో పనిచేసి బయటికి వచ్చిన తర్వాత కూడా ఫైర్ బ్రాండ్ ఆదివాసీ మహిళా నేతగా సీతక్క ఎదిగారు.  రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా పేరుంది. అందుకే కీలకమైన పంచాయితీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలను ఆమెకు కేటాయించారు.

ములుగు జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను మంత్రి కట్టడి చేయలేక పోయారనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఇసుక వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోవడం లేదని ఆమె చెప్తున్న మాటలను ప్రజలు నమ్మడం లేదు. మంత్రి ప్రధాన అనుచరులే చక్రం తిప్పుతూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇసుక రీచ్ లను మంజూరు చేయించడంతో ఈ వాదనకు బలం చేకూరుతున్నది. జిల్లాకు చెందిన ఒక కీలక నేత కలెక్టర్ వద్దకు వెళ్ళి ఇసుక రీచ్ ల వ్యవహారం చక్కదిద్దుతున్నారంటే మంత్రి జోక్యంతోనే ఇదంతా జరుగుతోందని స్పష్టమవుతోంది. ఇసుక రీచ్ ల కోసం ఎవరైనా మంత్రి వద్దకు వెళ్తే ఒక నాయకుడి పేరు సూచించి ఆయనే కలెక్టర్ తో మాట్లాడతారని మంత్రి చెప్పడం చూస్తే అంతా బహిరంగ రహస్యమేనని స్పష్టమవుతోంది. నిజంగా ఇసుక వ్యవహారాలతో తనకు సంబంధం లేక పోతే ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు చెప్పడంతో పాటూ తన పేరు చెప్పి ఎవరైనా ఇసుక అనుమతుల కోసం వస్తే పనులు చేయవద్దని అధికారులకు ఆదేశాలిచ్చి ఉంటే మంత్రికి నిజంగానే సంబంధంలేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. కానీ ఇవేమీ చేయకుండా మౌనం వహించడం అర్థఅంగీకారంగా ప్రజలు భావిస్తున్నారు. 

సీతక్క చేతిలోనే అంతా..

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక సహా చిన్న తరహా ఖనిజాలపై పూర్తి హక్కు ఆదివాసీలకే దక్కుతుంది. కేవలం సీనరేజి పోనూ మిగిలిన ఆదాయం మొత్తం ఆదివాసీలకి దక్కే విధంగా ప్రభుత్వం చూడాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఇసుక రీచ్ లలో ఇసుక తవ్వకాలు, లోడింగ్ పనులను మాత్రమే రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతో ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించి ఆదాయంలో సింహ భాగాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలిస్తున్నారు. ఆదివాసీ సహకార సంఘాలకు సాధికారిత కల్పించి ఇసుక రీచ్ లను స్వయంగా నిర్వహించుకునేలా చూడాల్సిన ప్రభుత్వం పరోక్షంగా బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకానికి, లోడింగ్ కు రూ. 220 చెల్లిస్తుంటే సహకార సంఘాలకు బోనస్ రూపంలో కేవలం రూ. 40 మాత్రమే చెల్లించి బినామీ కాంట్రాక్టర్లకు మాత్రం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ. 180 చెల్లిస్తున్నారు. సహకార సంఘాలే స్వయంగా ఈ పనులు చేసుకుంటే ఆదివాసీ మహిళలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. ఈ ధర్మ సూక్ష్మం మంత్రికి తెలియనిది కాదు.

మంత్రి సీతక్క ఆదివాసీ మహిళ కావడమే కాక న్యాయ శాస్త్రంలో పీహెచ్ డీ చేశారు. పీసా చట్టాన్ని అమలు చేయాల్సిన పంచాయితీరాజ్ శాఖ తో పాటూ మహిళా శిశు అభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నారు. ఇసుక రీచ్ లలో కొనసాగుతున్న దళారీ వ్యవస్థను తీసివేసి ఆదివాసీ మహిళలకు వీటిని అప్పగించడం కేవలం ఒక్క రోజులో చేయవచ్చు. సంబంధిత మంత్రిగా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్ళాల్సిన మంత్రి ఆ పని చేయక పోవడం విశేషం. 

క్రేజ్ తగ్గుతోందా?

ములుగు నియోజకవర్గంలో మూడవ సారి గెలిచిన సీతక్క క్రేజ్ ఇటీవలి కాలంలో మసకబారుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వెనుక బడిన ఈ నియోజకవర్గం అభివృద్దికి ఆమె చేయాల్సనంత చేయక పోవడంతో విమర్శల పాలవుతున్నారు. అధికారంలో లేనప్పుడు ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న సీతక్క మాజీ మంత్రి చందూలాల్, ఆయన కుమారుడు ప్రహ్లాద్ ఆగడాలను ఎండగట్టే వారు. కోవిడ్ సమయంలో మారుమూల ఆదివాసీ వలస గ్రామాలకు కాలి నడకన, ట్రాక్టర్ల మీద, టూవీలర్ పైనా వెళ్ళి వారిని ఆదుకోవడంతో సీతక్క పేరు మారుమ్రోగి పోయింది. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమని, చేసిన దానికి కన్నా ఎక్కువగా హైప్ సృష్టించుకుంటున్నారని ఆమె ప్రత్యర్థులు విమర్శించినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ప్రజల మన్ననలు పొంది మూడవ సారి ఘన విజయం సాధించారు. 

డీసిల్టేషన్ పేరుతో అప్రతిష్ఠ..

గోదావరి పూడిక పేరుతో మంగపేట మండలంలో  రూ. 650 కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక రీచ్ లను మంజూరు చేసి బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో ఈ అక్రమ దందానూ సీతక్క అడ్డుకోలేక పోయారనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. విచక్షణా రహితంగా భారీ యంత్రాలతో గత కొన్నేండ్లుగా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలతో తీర ప్రాంతం కోతకు గురై గోదావరి వరదల్లో భూములు మునిగిపోతున్నాయి. దీనిపై గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కృష్ట ఆదిత్య ప్రభుత్వానికి, హైకోర్టుకు ప్రత్యేక నివేదికను అందచేశారు. ఇప్పడు డీసిల్టేషన్ పేరుతో భూగర్భ జలాలకు కూడా అడుగంటి పోయే ప్రమాదం ఉందని మంగపేట మండలం తీర ప్రాంత గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. వారు హైకోర్టును కూడా ఆశ్రయించారు. గత కలెక్టర్ దివాకర ఇచ్చిన ఇసుక అనుమతులపై ప్రస్తుత కలెక్టర్ దర్యాప్తునకు కూడా ఆదేశించారు. ఇదంతా సీతక్క చెవికి సోకడం లేదా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. 

అడుగడుగునా అవినీతి..

ములుగు జిల్లాలో ఇసుక వ్యాపారం తారా స్థాయికి చేరింది. రాష్ట్రంలో ఎక్కడా లేనంత మంది అవినీతి అధికారులు ములుగు జిల్లాకు చేరుకున్నారు. ఇసుక ద్వారా నాలుగు రాళ్ళు వెనకేసుకోవడమే వీరి లక్ష్యం. మైనింగ్, భూగర్భజలాలు, సహకార శాఖల అవినీతి తారాస్థాయికి చేరింది. ఇదంతా సీతక్క దృష్టికి వచ్చినా ఒక్క అధికారిపై కూడా చర్యలకు ఆదేశించలేదు. సీతక్క తలుచుకుంటే అవినీతి బ్యాచ్ మొత్తం ఒకే రోజు ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ పని చేయడానికి మంత్రికి ఏమి అడ్డువస్తున్నదో ఎవరికీ తెలియదు. 

రాజకీయంగానూ దెబ్బ..

ఇసుక వ్యవహారాల్లో దళారుల పాత్ర తగ్గించక పోతే సీతక్క రాజీకీయంగా బలహీనపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నకల్లో ఏటూరునాగారం మేజర్ పంచాయితీని బీఆర్ఎస్ దక్కించుకోవడం మంత్రికి పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఆదివాసీ మహిళకు పూర్తిగా సాధికారిత కల్పిస్తే ఇసుక మకిలి నుంచి మంత్రి బయట పడే అవకాశం ఉంది. 

Leave A Reply

Your email address will not be published.