అందుకే రామజపం చేస్తున్న బిజెపి
కరీంనగర్ అభివృద్దికి బండి చేసిందే లేదు
మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రధాని మోదీ ఫొటోతో గెలిచే పరిస్థితిలో లేరని..అందుకనే అయోధ్య రాముడి ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రామజపం చేస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాముడు అందరివాడన్నారు. 5 ఏళ్లలో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. తాను జిల్లాను ఎలా చేశానో ప్రజల అందరికీ తెలుసునని చెప్పారు. సోమవారం నాడు కోహెడ మండలంలోని శనిగరం పెద్ద చెరువును ఆకస్మికంగా సందర్శించారు.
శనిగరం గ్రామంలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని , అక్కడ అవసరమైన బోర్ వేల్స్ వేసుకోవడంతో పాటు అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సెక్రెటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాలల్లో తరగతి గదులకు కలర్స్ వేయడంతో పాటు టాయిలెట్స్ నిర్మాణం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడుతూ.. ఎండాకాలంలో ఈసారి ముందుగానే భూగర్భ జలాలు పడిపోయాయన్నారు.
కాంగ్రెస్ కరువు తెచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారని.. కానీ బీఆర్‌ఎస్ తెచ్చిన కరువు ఇదని ఎద్దేవా చేశారు. గ్రామానికి , మండలానికి, నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఏ సమస్య వొచ్చిన తాను 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామగ్రామాన పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. కొంతమంది భూ పంచాయతీలల్లో తనను ఇన్వాల్వ్ చేస్తున్నారని.. వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.