మా ఆస్తికి సంబంధించిన ఓరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు మీ దగ్గర ఎందుకు పెట్టాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేడు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ-స్టాంపులు, ఎక్కడి నుండి అయినా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఓరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రభుత్వం వద్ద జిరాక్స్ కాపీలు యజమానులకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం చూస్తే మన ఆస్తులు కాజేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కుట్రలను తెలుసుకుని అతడిని ఇంటికి సాగనంపక పోతే మన ఆస్తులను తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకుని దోచుకుంటాడని ఆరోపించారు.
వచ్చే అక్టోబర్ ఒకటో తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రెవెన్యూ ఉద్యోగుల కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కాకినాడలోని రెవెన్యూ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు ఇతర శాఖల పనులు కూడా అప్పగిస్తున్నారని, దానివల్ల వారు మానసిక ఒత్తిడి, ఆరోగ్య ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉన్నదన్నారు.
రాష్ట్ర కౌన్సిల్ నిర్వహణకు ముందస్తుగా కాకినాడలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ముఖ్యులతో సమావేశాన్ని నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని వివరించారు. రెవెన్యూ ఉద్యోగుల పై భారం వేయొద్దని, ఈ విషయంలో కలెక్టర్లు సహకరించాలని బొప్పరాజు కోరారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పితాని త్రినాధరావు, రాష్ట్ర కోశాధికారి గిరి కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, వి.ఆర్. ఓ.ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోన అంజనేయ కుమార్, వి.ఆర్.ఎ.ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య, రెవెన్యూ అసోసియేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.