హైదరాబాద్, జూలై 28:ఏపీ రాజకీయాల్లో ఎన్నికల హీట్ ఇప్పుడే కనిపిస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా విమర్శలు కొనసాగుతున్నాయి. జనసేన,టీడీపీ, బీజేపీ పార్టీలు అధికార వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేతలకు అధికార పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది… చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
రాష్ట్రంలో ఇస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాకపోతే సినిమా యాక్టర్లు వస్తారా అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్సనారాయణ ప్రశ్నించారు. తల్లిదండ్రులు రావాడం తప్పని నేను అనుకోవడం లేదు.. కోర్టు దీనిపై సూచనలిస్తే వాటిని పాటిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్దిపై చంద్రబాబు ఏం మాట్లాడుతాడు.. ఒక్కసారి చంద్రబాబుని విజయనగరం వచ్చి చూడమనండి.. కుప్పం కంటే మా జిల్లా ఎంత బాగుంటుందో అప్పుడు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖకు వస్తుంది అని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి బొత్స సత్సనారాయణ ప్రశ్నించారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతుందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స అన్నారు.