హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులపై దానం పరుషపదజాలం ఉపయోగించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. తన వ్యాఖ్యలపై దానం నాగేందర్ వివరణ ఇచ్చారు.
తాను సభలో గతంలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదన్నారు. సభలో తాను సీనియర్ వ్యక్తిని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల దానం విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తనను రెచ్చగొట్టారని, దీంతో తాను మాట్లాడవలసి వచ్చిందన్నారు. తన గురించి, తన పనితీరు గురించి అందరికీ తెలుసునన్నారు. అయినప్పటికీ తాను ఉపయోగించిన పదజాలం తెలంగాణలో మామూలే అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్… దానం వ్యాఖ్యలను పరిశీలించి అవసరమైతే రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.