విచారణ పేరుతో వివస్త్రను చేసి, థర్డ్ డీగ్రీ ప్రయోగం
సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి…బాధ్యులైన పోలీసులను డిస్మిస్ చేయాలి
కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
బంగారం దొంగతనం చేసిందని నెపంతో దళిత మహిళా సునీతపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి మరో నలుగురు పోలీసులు రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి నానారకాల చిత్రహింసలకు గురిచేసిన పోలీసులను తక్షణమే డిస్మిస్ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధిత దళిత మహిళ సునీతను కెవిపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడ సామేలు, యం ప్రకాష్ కరత్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి లక్ష్మీదేవి బృందంతో కలిసి ఆమెను పరామర్శించారు. జరిగిన సంఘటన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ…దళిత మహిళ సునీత ఇంటి పక్కన గల నాగేందర్ అనే వ్యక్తి ఇంట్లో బంగారం దొంగిలించిందనే నెపంతో రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ పిలిపించి పురుష పోలీసులు చీర విప్పి నెక్కర్ తొడిగి మరీ కర్రలతో కొట్టారని చెప్పారు.
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు నలుగురు పోలీసులు దొంగతనం పేరు మీద తన భర్త భీమయ్యను మొదట్లో కొట్టి వదిలేసి తన చిన్న కుమారుడు మైనర్ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్న జగదీష్‌ను సైతం కర్రలతో కొట్టారని చెప్పారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమారుడు ముగ్గురిని వదలకుండా చితక బాదారని బాధిత దళిత మహిళను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక స్త్రీగా తాను చెప్పలేని చోట కొట్టారని చెప్పారు. దెబ్బలు తట్టుకోలేక దాహం వేస్తే నీళ్లు తాగించి మరీ కొట్టారని బూటు కాళ్లతో తొక్కి బెల్ట్‌లతో చితక బాధారని చెప్పారు. నేరం ఒప్పుకోవాలంటూ కన్నతల్లి ముందే కుమారుడు జగదీష్‌ను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తామిద్దరినీ దారుణంగా కొట్టారు. కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు, కాళ్లకు జండ్ బామ్ రాయించారు. ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు.
ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళితే.. షాద్ నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్, అఖిల, అనే మొత్తం ఐదు మంది పోలీసులు సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్ తొమ్మిదవ తరగతి చదువుతున్న కొడుకును, తల్లి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. డిఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు పేర్కొంది.
పోలీస్ స్టేషన్ తీసుకువొచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి కన్న కొడుకు జగదీష్ ముందే చితకబాదారు. దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు అయిన జగదీశ్వర్‌ను కూడా అరికాళ్ళపై రబ్బర్ బెల్ట్‌తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు. కొడుతున్న దెబ్బలకు తాళలేక పోయానని బాధిత మహిళ పేర్కొన్నట్లు చెప్పారు. దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని నిజనిర్ధారణ కమిటీ పేర్కొంటూ ..థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డిఐ రామ్ రెడ్డి మరో నలుగురు కానిస్టేబుళ్లను తక్షణమే డిస్మిస్ చేయాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని, బాధిత దళిత మహిళకు అత్యాధునిక వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియో అందించాలని కెవిపిఎస్ ప్రతినిధులు డిమాండ్ చేసారు.
ఈ నిజనిర్ధారణ కమిటీ బృందంలో కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడ సామెల్, ఎం ప్రకాష్ కరత్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి లక్ష్మీదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సిఐటియు సీనియర్ నాయకులు వడ్ల చంద్రమౌళి, సిఐటియు నాయకులు కావలి రాజు, రాజశేఖర్, శ్రీనివాస్, ఐద్వా నాయకురాలు లక్ష్మి, కెవిపిఎస్ నాయకులు కొంగరి నర్సింహులు, మహమ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు.