పాలకొండ:తెలంగాణ ప్రభుత్వం తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు 10 వేల రూపాయలు సాగు సాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. ఖరీఫ్ సీజన్లో రైతులు వరి విత్తనాలు నాటుతున్న పనుల్లో ఉన్నారని వాతావరణం అనుకూలించటం శుభపరిణామని ఇదే సమయంలో రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు.
వ్యవసాయం చేయడం రోజురోజుకీ కష్టమవుతుందని వ్యవసాయం పెట్టుబడి మరియు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతును వెంటాడుతుందని పంట పండే సమయంలో కొని నాధుడు లేక రైతు దళారుల పాలై తీవ్రంగా నష్టపోతున్నారని ఈ సమయంలో రైతులను ఆదుకోవడానికి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి 13,500 రైతు భరోసా పేరుతో ఇస్తున్నాయని ఇది ఏ మాత్రం రైతుకు చాలటం లేదని పెరిగిన అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని గుర్తు చేశారు.కావున క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతును ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదివేలు చొప్పున రైతుకు సాగు చేస్తున్న భూమి అంతటికి సాగు సాయం చేయడం రైతుకు తోడ్పాటు అందించడం శుభ పరిణామం అన్నారు.
కావున తెలంగాణ ప్రభుత్వం వలె మన రాష్ట్రంలో కూడా సాగుసాయం ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసి రైతుల్లో చైతన్యం తీసుకొస్తామని తద్వారా పాలక,ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు.కేరళ తరహా రైతు రుణ ఉపశమన చట్టాన్ని తీసుకురావాలని, వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని మరియు రైతు,కౌలు రైతుల అన్ని రకాల పంట రుణాలను రెండు లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేయాలి,50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు,కౌలు రైతుకు నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలని అన్నారు.