A place where you need to follow for what happening in world cup

బీఎస్పీ, వామపక్షాలతో కాంగ్రెస్

ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది.   పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీఆర్‌ఎస్‌లో సీట్లు ఆశించి భంగపడిన నేతలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీఎఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంచింది. ఎవరైనా పార్టీలో చేరవచ్చని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని చెబుతోంది.తాజాగా రాష్ట్రంలో వామపక్షాల పార్టీలో చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం పొత్తు దిశగా అడుగులు వేస్తోంది.

అంతటితో ఆగకుంగా తమ బలాన్ని పెంచుకునేందుకు ఇతర పార్టీలతో పొత్తులకు యత్నిస్తోంది. తాజాగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకారం తెలిపిందని సమాచారం.  జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి I.N.D.I.Aలో ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోను ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఇప్పటికే వామపక్షాలు, బీఎస్పీ ఓటు శాతంపై రాష్ట్ర వ్యాప్తంగా సునీల్ కనుగోలు సర్వే నిర్వహించారు. ఇందులో వామపక్షాలకు 1.5 శాతం ఓటర్లు ఉన్నట్లు గుర్తించారని, ప్రవీణ్‌ కుమార్ సారధ్యంలోని బీఎస్పీ పార్టీ ఓటు శాతం 1 నుంచి 3 శాతానికి ఓట్లు పెంచుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలతో స్నేహపూర్వకం, సానుకూలంగానే ఉంటూ వస్తోంది. దీంతో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులకు ఇబ్బంది ఉండదని, సీట్లు సర్దుబాటు చేసుకుంటే మూడు పార్టీల ఓట్లు బదలాయించుకునేలా ముందుకు సాగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫలితంగా అన్ని పార్టీలు ప్రయోజనం పొందవచ్చని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు సమాచారం.

అయితే రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న పది స్థానాల్లో సీట్లు కేటాయించానలి బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరగా సీపీఐ, సీఎం సైతం తమకు పది స్థానాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌లో సీట్ల కోసం ఒత్తిడి అధికంగా ఉంది. దీంతో సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా సీట్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో బీఎస్పీ 10కి  రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్ సమాధానం కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సిర్పూర్ కాగజ్ నగర్‌లో నిర్వహించిన సర్వేలో ప్రవీణ్ కుమార్‌కు అనుకూలంగా ఉండడంతో ఆ స్థానాన్ని ఆయనకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదనంగా మరో సీటు ఆదిలాబాద్‌లో ఇచ్చి బీఎస్పీకి నచ్చజెప్పాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్ కేటాయించాలని సీపీఐ కోరగా, ఇబ్రహీంపట్నం, భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, పినపాక టికెట్లు కావాలని సీపీఎం కోరుతన్నట్లు తెలుస్తోంది.

అయితే ఆయా పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. అధికార బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 17న బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో పార్టీలో పెద్ద ఎత్తున నేతల చేరికలు ఉండేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మైనం పల్లి హనుంతరావు మెదక్ సీటుతో పాటు మరో స్థానం ఇవ్వాలని కోరుతుండడంతో మెదక్‌కు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. మరో సీటు కావాలంటే కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అలాగే వేముల వీరేశం, యెన్నం శ్రీనివాసులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరంతా సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వర రావు పార్టీలో చేరితే ఖమ్మం లేదా పాలారు సీటు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని కేసీ వేణుగోపాల్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.