హైదరాబాద్, ఆగస్టు 9:మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అలాగే వారి అభిమానులంతా కూడా మెగా అభిమానులుగా కలిసే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితుల కారణంగా మెగా అభిమానుల్లో కొంతకాలంగా కాస్త గందరగోళం నెలకొంది. ఓ వైపు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న పవన్ ‘అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపిస్తుంటే.. మరోవైపు చిరంజీవి మాత్రం రాజకీయాలు మానేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ‘అంతా మీ దయ’ అన్నట్లుగా మెతక వైఖరి చూపుతూ అధికార పార్టీకి అస్త్రంలా మారారు. దీంతో పలువురు అధికార పార్టీ నేతలు చిరంజీవిని అడ్డుపెట్టుకొని పవన్ ని టార్గెట్ చేస్తున్నారు.ఆమధ్య ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గించడంపై పవన్ తన గళాన్ని బలంగా వినిపించారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వ పెత్తనం ఏంటంటూ పవన్ బలంగా నిలబడ్డారు. అయితే చిరంజీవి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సీఎం వైఎస్ జగన్ ని కలిసి చేతులు జోడించి వేడుకున్నారు. ఆ సమయంలో మెగా అభిమానులు నొచ్చుకున్నారు.
అప్పటికే చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్ కుటుంబాన్ని కలవడం పట్ల అసహనంగా ఉన్న అభిమానులకు.. చిరు చేతులు జోడించి వేడుకోవడం పుండు మీద కారం చల్లినట్లు అయింది. ఇలా పవన్, చిరంజీవి భిన్న వైఖరితో కొందరు మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఓ వైపు చిరంజీవిని పొగుడుతూ, మరోవైపు పవన్ మీద దారుణమైన విమర్శలు చేశారు. పవన్ కుటుంబంపైనా ఎన్నో దారుణ వ్యాఖ్యలు చేశారు. పవన్ కుటుంబం అంటే చిరంజీవి కుటుంబమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయినప్పటికీ చిరు నోరు మెదపలేదు. ఆయన వైఖరి పట్ల పవన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరి అభిమానుల ఆవేదన ఇన్నాళ్ళకు చిరంజీవికి చేరిందో లేక రాబోయే కొద్ది నెలల్లో అధికారం మారుతుందన్న నమ్మకమో తెలీదు కానీ.. ఇన్నిరోజులు మంచుపర్వతంలా కనిపించిన చిరంజీవి.. ఒక్కసారిగా అగ్నిపర్వతంలా మారారు.
చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర 200 రోజుల వేడుకలో పాల్గొన్న చిరు.. పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “మీరు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి” అంటూ మెగాస్టార్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. చిరు ఎట్టకేలకు తన నోరు మెదపడంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. అదే సమయంలో ఏపీలో ‘భోళా శంకర్’ పరిస్థితి ఏంటి? అని భయపడుతున్నారు. ఎందుకంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించినందుకు పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ విడుదల సమయంలో ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందనేది బహిరంగ రహస్యం. ఇంతకాలం తన మెతక వైఖరితో పవన్ ని ఇరుకున పెట్టి తమకు లాభం చేకూర్చేలా ఉండటంతో.. చిరంజీవిని అధికార పార్టీ నేతలు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు.
కానీ ఇప్పుడు చిరు తన స్వరం వినిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఇంతకాలం పవన్ మీద చేసిన విమర్శలు ఇప్పుడు చిరు మీద చేసే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ సినిమాకి ఇబ్బందులు కలిగించే అవకాశాలున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. ఆ విమర్శలను, ఇబ్బందులను మృదుస్వభావి అయిన చిరంజీవి తట్టుకోగలరా? ఇకముందు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ్ముడికి మద్దతుగా తన స్వరం వినిపిస్తారా? అలాగే తన అన్న జోలికొస్తే ఊరుకొని పవన్ ‘భోళా శంకర్’ కోసం ఏ మేరకు అండగా నిలబడతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇంతకాలం ఏపీ అధికార పార్టీ నేతలకు పవన్ అగ్నిపర్వతంలా, చిరంజీవి మంచుపర్వతంలా కనిపించారు. కానీ ఇప్పుడు చిరంజీవి తాను కూడా మంచు కప్పుకున్న అగ్నిపర్వతాన్ని అని తెలిపేలా.. కాస్త మంచుని తొలగించి చిరు కోపాన్ని ప్రదర్శించారు. మరి ఈ కోపం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.