భద్రాచలంకు ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వొచ్చే ప్రజలకు వారధిగా ఉన్న భద్రాచలం బ్రిడ్జికి విజయవంతంగా 59 సంవత్సరాలు పూర్తయ్యాయి. 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1955కు ముందు భద్రాచలానికి ఇతర ప్రాంతాల నుండి ప్రజలు, భక్తులు రావాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. గోదావరి నదిపై నాటుపడవల ద్వారా భద్రాచలం చేరుకునే వారు.
వివిధ అవసరాల దృష్ట్యా వచ్చి మళ్ళీ నాటుపడవల మీద సారపాక చేరుకునే వారు. భద్రాచలం ఏమాత్రం సౌకర్యాలు లేవు. అప్పటి ప్రభుత్వాలు కూడ భద్రాచలంపై అంతగా శ్రద్ద పెట్టలేదు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడం వలన భద్రాచలంకు ప్రాముఖ్యత ఇవ్వలేదు, అయితే ప్రతీ ఏటా జరిగే శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణానికి భక్తులు సారపాక వద్ద నాటుపడవల మీద భద్రాచలం చేరుకుని స్వామివారి కల్యాణాన్ని తిలకించే వారు. సుమారు వారం రోజులకు ముందే భక్తులు లాంఛీలు నాటుపడవలతో చేరుకుని స్వామివారిని దర్శించుకుని తిరిగివెళ్ళేవారు.
1955వ సంవత్సరంలో శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకునేందుకు సారపాక నుండి భద్రాచలం పడవపై గోదావరి దాటుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడంతో సుమారు 400 మంది భక్తులు మునిగిపోయి మృతి చెందిన సంఘటన జరిగింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని మంజూరు చేయటం జరిగింది. ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించారు. 1965 జూలై 13వ తేదీన అప్పటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు.
డా.నీలంసంజీవ రెడ్డి 1959లో శంఖుస్థాపన చేయగా కేవలం 70 లక్షల వ్యయంతోనే ముంబైకు చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ 1965లో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటికి విజయవంతంగా 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికి కూడ బ్రిడ్జి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటికి ఈ బ్రిడ్జి పైనుండే వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. ఇటీవలే మరో బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. ఏప్రిల్ నెలలో జరిగిన శ్రీ సీతారామ కల్యాణం రోజున జిల్లా కలెక్టర్ ప్రియాంక అల లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు భద్రాచలంకు రెండు బ్రిడ్జిలు ఉన్నాయి.